తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలను ( Tirumala ) సోమవారం సినీ ప్రముఖులు పలువురు దర్శించుకున్నారు. అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) కుటుంబంతో పాటు, తమిళ నటుడు మాధవన్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. నాగార్జున కుమారుడు అఖిల్ ( Akhil ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ ( Lenin ) ఈనెల 10న విడుదల కానున్నందున ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు తిరుపతిలో జరగనున్నాయి.
ఈ సందర్భంగా నాగార్జున, ఆయన సతీమణి అమల, అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, సునీల్, నిర్మాత నాగవంశీ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదల ప్రకారం అర్చకులు శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని ఆలయ అధికారులు వివరించారు. ఆదివారం స్వామివారిని 88,412 మంది దర్శించుకోగా 31,273 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ.5.05 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 4.24 లక్షల లడ్డూలను విక్రయించామని, 4.24 లక్షల మందికి అన్నప్రసాదం అందించామన్నారు.