Sukhbir Singh Badal | న్యూఢిల్లీ: సిక్కు మత కోడ్ను ఉల్లంఘించినందుకు గాను శిరోమణి అకాలీ దళ్(ఎస్ఏడీ) మాజీ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్ మరుగుదొడ్డి శుభ్రం చేయాలని ఐదుగురు సిక్కు మతాధికారులతో కూడిన అకాల్ తఖ్త్ జతేదార్ సోమవారం ఆదేశాలు జారీచేసింది. సుఖ్బీర్సింగ్ సిక్కుమత నిబంధనలను (తంఖైయా) ఉల్లంఘించినట్టు తేలడంతో ఈ మేరకు శిక్ష విధించింది. బాదల్, ఆయన సహచరులు గంటపాటు బాత్రూం శుభ్రం చేయాలని, అలాగే గురుద్వారలోని వంటశాలలో గంటపాటు పాత్రలు శుభ్రం చేయాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో సుఖ్బీర్సింగ్ బాదల్ సహా కోర్ కమిటీ సభ్యులు, 2015 నాటి ప్రభుత్వంలో క్యాబినెట్ సభ్యులుగా ఉన్నవారు డిసెంబర్ 3న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు బాత్రూంలను శుభ్రం చేస్తారు. ఆ తర్వాత స్నానాలు చేసి వంటశాలలో భోజనం వడ్డిస్తారు. అనంతరం శ్రీ సుఖ్మణిని పఠిస్తారు. పంజాబ్లో ఎస్ఏడీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్బీర్సింగ్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2007-17 మధ్య మతపరమైన తప్పుడు నిర్ణయాలను తీసుకున్నారని సుఖ్బీర్ను అకాల్ తఖ్త్ దోషిగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో తాజాగా శిక్ష విధించింది.