ప్రపంచ టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) భారీ కుదుపులు తెస్తున్నది. నిన్నటివరకు ఆకర్షణీయంగా నిలిచిన ఐటీ జాబ్ నిర్వచనం మారిపోతున్నది. కంపెనీల ఉద్యోగాల ఊచకోత టెకీలకు కునుకు లేకుండా చేస్తున్నది. ఏఐ ఆధారిత వ్యవస్థల కోసం కంపెనీలు చేపట్టిన పునర్వ్యవస్థీకరణలో ఉద్యోగాలు హుష్‌కాకి అవుతుండటమే ఇందుకు కారణం. ఆరకిల్ నుంచి అమెజాన్ వరకు దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగాలను ఊడగొడుతున్నాయి. ఈ కోతలు ఇండియాకూ పాకాయి. ఆరకిల్ ఇండియా మొన్న మంగళవారం ఒకేరోజు 2,500 మందికి ఉద్వాసన పలికింది. ‘ఈ రోజు మీకు చివరి పనిరోజు’ అనే సందేశాలు అందుకున్న టెకీలు అవాక్కయ్యారు. భారత్‌లో ఆరకిల్ మొత్తం సిబ్బంది 30 వేల మంది. అందులో ఇప్పటివరకు 12 వేలమందికి పైగా పింక్ స్లిప్పులు అందుకున్నారు. దీనిని బట్టి తొలగింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయవచ్చు. మరికొన్ని వారాల్లో మరిన్ని తొలగింపులు ఉంటాయని వినిపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 30 వేల పైచిలుకు ఉద్యోగులను ఆరకిల్ తొలగిస్తున్నది. భారతదేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ తన ఆరు లక్షల మంది సిబ్బందిలో 2 శాతం, అంటే 12 వేల మందిని తొలగించింది. మైక్రోసాఫ్ట్, ఇంటెల్, బ్లాక్, మెటా, యాపిల్.. ఇలా పేరున్న కంపెనీలన్నీ భారం తగ్గించుకొనే పనిలో పడ్డాయి. ఏఐతో మానవాళికి ముప్పు పలువురు హెచ్చరించారు. ఇప్పుడు టెకీల మెడకు ఏఐ ఉచ్చు బిగిస్తున్నది.
సుమారు రెండు దశాబ్దాల ఐటీ పొంగు క్రమంగా చల్లారుతున్నది. 2005-2020 మధ్యకాలంలో దూకుడు చూపిన ఐటీ కంపెనీలు రిక్రూట్మెంట్కు బ్రేకులు వేస్తున్నాయి. వార్షిక ఆదాయాలు, ఉద్యోగాల పెరుగుదల 15 శాతం నుంచి కొవిడ్ అనంతరకాలంలో 5-6 శాతానికి పడిపోయింది. ఇప్పుడు ఏఐ దెబ్బకు కోతలు తారస్థాయికి చేరుకున్నాయి. సంస్థ వ్యాపార అవసరాల రీత్యా అనేక జాబ్స్ నిరర్థకంగా మారుతున్నాయని కంపెనీలు అంటున్నాయి. గత ఏడాది సుమారు 1,12,732 మంది టెకీలు రోడ్డున పడ్డారు. ఈ ఏడాది ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. 2031 నాటికి ఆటోమేషన్ కుదుపు 20 శాతం వరకు ఉండొచ్చని ఐటీపై నీతిఆయోగ్ విడుదల చేసిన నివేదికలో అంచనా వేసింది. ఏఐ దూసుకొస్తున్న నేపథ్యం ఓ వైపు, ఆర్థిక అస్థిరతలు మరోవైపు అడకత్తెరలా బిగుస్తుండటమే ఇందుకు కారణమని చెప్పాలి.
ఉద్యోగాల కోత అనేది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఎందుకంటే ఐటీ పరిశ్రమ ఓ పెద్ద మలుపులో నిల్చున్నది. ఏఐ ప్రభావంతో సాధారణ కోడింగ్ ఉద్యోగాలు కొండెక్కుతున్నాయి. సాంప్రదాయిక పని పద్ధతులకు కాలం చెల్లిపోయి ఒకరకం ఉద్యోగాలకు డిమాండ్ తగ్గుతున్నప్పటికీ, మరోరకం ఉద్యోగాల అవసరం క్రమంగా పెరుగుతుండటం ఆశాజనకంగా ఉన్నది. ఏఐని నియంత్రించేది అంతిమంగా మనుషులేనన్నది నిర్వివాదాంశం. జాబ్ మార్కెట్‌ను ఏఐ కొత్తపుంతలు తొక్కిస్తున్నది. గత రెండేండ్ల కాలంలోనే 13 లక్షల ఉద్యోగాలను ఏఐ సమకూర్చింది. సరికొత్త టెక్ యుగానికి ఏఐ, డాటా, డిజిటల్ ఇంజినీరింగ్ ప్రావీణ్యాలు ముఖ్యావసరాలుగా ఎదిగివస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ప్రావీణ్యాలు సంతరించుకోవడం ఒక్కటే పరిష్కారమని టెకీలూ గుర్తించాలి.