అహ్మాదాబాద్: అహ్మాదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా(Ahmedabad Plane Crash) విమానానికి చెందిన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ దొరికినట్లు దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు ద్రువీకరించారు. విమాన ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందన్న అంశాలను కనుగొనడంలో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ కీలకం కానున్నది. విమాన ప్రమాద మృతుల సంఖ్య 270కి చేరిన విషయం తెలిసిందే. అయితే విమానంలో ఉన్న 241 మంది ప్రయాణికులు మరణించారు. ఫ్లయిట్ డేటా రికార్డర్‌ను గుర్తించినట్లు ఇంతకుముందే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ వద్ద ప్రధాన కార్యదర్శిగా ఉన్న పీకే మిశ్రాకు.. బ్లాక్ బాక్సులు దొరికిన విషయాన్ని దర్యాప్తు అధికారులు కన్ఫర్మ్ చేశారు. ఆదివారం రోజున ఆయన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనపై ఏఏఐబీ విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నది. అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు కూడా ఈ ఘటన పట్ల విచారణ కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ ప్రోటోకాల్స్ ప్రకారం ఆ దర్యాప్తు జరుగుతున్నది. ఎయిర్ ఇండియా విమానం.. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థది కావడంతో.. ఆ దేశం కూడా విచారణలో సహకరిస్తున్నది. ఫ్లయిట్ డేటా రికార్డర్(ఎఫ్డీఆర్), కాక్‌పిట్ వాయిర్ రికార్డర్(సీవీఆర్) దొరికిన విషయాన్ని మిశ్రాకు అధికారులు తెలిపారు.
బోయింగ్ కంపెనీకి చెందిన నిపుణులు కూడా ఇవాళ అహ్మదాబాద్ చేరుకున్నారు. విమాన దుర్ఘటనపై వాళ్లు దర్యాప్తు చేపట్టనున్నారు. కూలిన విమానం 787-8 డ్రీమ్‌లైనర్ మోడల్ కావడంతో.. బోయింగ్ సంస్థ ఈ ఘటనపై సమగ్ర స్థాయిలో విచారణ చేపట్టనున్నది.