హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీపై దేశంలో తొలిసారి జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యమిచ్చేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. రెండ్రోజులపాటు జరిగే ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి దాదాపు 2 వేల మంది ఐటీ రంగ నిపుణులు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏఐ సిటీ ప్రాజెక్టుపై ఈ సదస్సులో ప్రత్యేక ప్రకటన చేసే అవకాశం ఉన్నది. ఈ సదస్సులో భాగంగా ఏఐ స్టార్టప్ షోకేస్‌ను ప్రారంభించనున్నారు. ‘ది ప్యూచర్ ఆఫ్ ఇండియా-ఇండియా ఏఐ 2047’ అనే అంశంపై నాస్కామ్ ప్రెసిడెంట్ దేబాంజీ ఘోష్ కీలక ప్రసంగం చేయనున్నారు. ‘మేకింగ్ జనరేటివ్ ఏఐ రియల్ ఫర్ భారత్’ అనే అంశంపై చర్చించనున్నారు. దాదాపు 25 అంశాలపై ఐటీ రంగ నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, వెంచర్ క్యాపిటలిస్టులు ప్రసంగించనున్నారు.
ప్రతి ఒక్కరికి కృత్రిమ మేథస్సు
‘ప్రతి ఒక్కరికి కృత్రిమ మేథస్సు’ అనే ఇతివృత్తం (థీమ్)తో నిర్వహించనున్న ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన ఏఐ రంగ ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఏఐ రంగం అభివృద్ధికి దోహదం చేసే ఆలోచనలను పరస్పరం పంచుకోవడంతోపాటు భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చించనున్నారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్ఠాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు. రాష్ర్టాన్ని ఏఐ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఈ సదస్సు వేదికగా నిలవనున్నది. ఏఐ రంగంపై రోడ్ మ్యాప్‌ను ఈ సదస్సులో విడుదల చేయనున్నారు.