హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): భారత్, జర్మనీ సంయుక్తంగా చేపడుతున్న ‘వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ సమతుల్యత’ ప్రాజెక్టుపై బెర్లిన్లో మంగళవారం ఒప్పందం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ వెల్లడించారు. ఈ ఒప్పందంపై జరిగిన చర్చల్లో తనతోపాటు, జర్మనీ పరిశోధనల కేంద్రమైన ఫ్రౌన్ హోఫర్ ప్రధాన సంచాలకులు డాక్టర్ సెబాస్టియన్ బొస్సె హాజరయ్యారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సమన్వయకర్తగా డాక్టర్ రఘు చలిగంటి వ్యహరిస్తారని తెలిపారు.
వ్యవసాయ సమతుల్యత కోసం పరిష్కారాలు చూపడం దీని లక్ష్యమని తెలిపారు. 2021 నుంచి 2025 వరకు ఈ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణతో జర్మనీ వ్యవసాయ మంత్రిత్వశాఖ విత్తనరంగంలో పరిశోధన, ప్రపంచ విస్తరణ కార్యక్రమంలో పరస్పరం సహకరించుకుంటాయని తెలిపారు. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థలను బలపర్చడానికి మరో ప్రాజెక్టుపై చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. మొదటి దశలో డిసెంబర్ 2023 నుంచి ఒక మిలియన్ యూరో నిధులతో ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జర్మనీ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, తెలంగాణ వ్యవసాయ శాఖలు ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయమైన అగ్రిహబ్ (వ్యవసాయాధారిత పరిశోధన కేంద్రం), జర్మనీలోని పరిశోధన కేంద్రమైన ఫ్రౌన్ హోఫర్ దీనిని అమలు చేయనున్నాయని తెలిపారు.