వృద్ధులలో మోకాలు కీళ్ల అరుగుదల సర్వ సాధారణం. ఎక్కువ శాతం వయోజనులు మోకాలు కీళ్ల నొప్పుల మూలంగానే సరిగా నడవలేక మలిసంజెలో భారంగా బతుకీడుస్తుంటారు. అయితే వృద్ధాప్యంలో మోకీళ్ల మార్పిడి చేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని చాలామంది భావిస్తుంటారు. కానీ, అదంతా అపోహే అంటున్నారు వైద్యులు. వయసు పైబడిన తర్వాత కూడా మోకాలు కీళ్ల మార్పిడితో వారు పూర్తిగా కోలుకొని మునుపటిలా ఉత్సాహంగా తిరిగే అవకాశం ఉందని అభయమిస్తున్నారు. మోకాలు, కీళ్ల మార్పిడికి అత్యాధునిక శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చింది. చెడిపోయిన, పనిచేయలేని స్థితికి చేరిన మోకాలు కీలును తొలగించి దాని స్థానంలో కొత్తదానిని అమర్చే సాంకేతికత అందుబాటులో ఉంది. దీని సాయంతో 80, 90 ఏండ్లు పైబడిన వారికీ మోకాలు కీళ్ల మార్పిళ్లు విజయవంతంగా జరుగుతున్నాయి. ఈ విశేషాలు ఇవాళ్టి ఊపిరిలో తెలుసుకుందాం..
ఆర్థోపెడిక్ సర్జన్లే ఈ మోకాలు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సను చేస్తారు. తీవ్రమైన ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, అంగవైకల్యాన్ని సరిచేయడానికి సంబంధించి మోకాలు కీళ్ల మార్పిడి చాలా ప్రభావశీలమైన, కచ్చితమైన పరిష్కారం. వ్యాధిగ్రస్తులు మామూలుగా తిరిగేందుకు ఇది చక్కగా తోడ్పడుతుంది. కీలు దెబ్బతిన్న స్థాయి, తీవ్రత వల్ల నడక భారం అవుతుంది. నిలబడటం కూడా కష్టమవుతుంది. చివరికి చెప్పులు సరిగ్గా వేసుకోలేకపోతారు. మెట్లు ఎక్కడంతోపాటు రోజువారీ పనులూ చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. మోకాలు కీలు పనిచేయలేని స్థితికి చేరుకున్నప్పుడు నొప్పిని నివారించి, సాధారణ జీవితం గడిపేందుకు వీలుగా దానిని మార్చుకోమని డాక్టర్లు సిఫారసు చేస్తారు. ఈ సమస్యను అధిగమించడానికి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స చివరి పరిష్కారంగా చెబుతారు వైద్యులు. ఈ సర్జరీ సందర్భంగా కొన్నిసార్లు వ్యాధి తీవ్రత, అప్పటికే జరిగిన నష్టం దృష్ట్యా కీలు మొత్తాన్ని తొలగిస్తారు.
అత్యధిక సందర్భాలలో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కారణంగానే మోకాలు కీళ్లు పనిచేయలేని పరిస్థితికి చేరుకుంటాయి. కొన్ని కుటుంబాలలో కీళ్ల వ్యాధులు వంశపారం పర్యంగా కూడా పలకరిస్తాయి. కీళ్లలోని ఎముకల చివరలో ఉండే మృదులాస్థికి తలెత్తే వ్యాధులతో మోకాలు కీళ్ల సమస్యలు ఏర్పడుతుంటాయి. ఇది కీళ్ల నొప్పుల వ్యాధికి నేరుగా కారణం కాకపోయినా.. ఊబకాయంతో మోకాళ్లపైన భారం పెరిగిపోయి కీళ్లు దెబ్బతింటాయి. ఈ రకమైన అనారోగ్య సమస్యల వల్ల కీళ్లు బలహీనపడి క్రమంగా పనిచేయలేని స్థితికి చేరుకుంటాయి. అది ఏమేరకు దెబ్బతిన్నది అన్న దానిని బట్టి నడవడం, మెట్లు ఎక్కడం వంటి సాధారణ పనులు కూడా చాలా కష్టం అనిపిస్తాయి.
ఆర్థరైటిస్ వ్యాధి బాగా ముదిరిన సందర్భాల్లో మోకాలు కీలు మార్పిడిని సూచిస్తారు వైద్యులు. వయసు పైబడిన కొద్దీ పరిస్థితి మరింత దిగజారుతుంటుంది. చికిత్స ఆలస్యమైన కొద్దీ మోకాలు కీలులోని మృదులాస్థి, ఎముక పూర్తిగా దెబ్బతింటుంది. ఆర్థరైటిస్ చివరి దశలో కేవలం మందులతో ఉపశమనం సాధ్యం కాదు. పైగా పలువురిలో కీలు ఏమాత్రం ఉపయోగం లేనిదిగా మారుతుంది. అప్పుడు మోకాలు కీలు మార్చడం ఒక్కటే మార్గం. అటువంటి పరిస్థితిలో మొత్తం కీలును మార్చేసి మోకాలు కదలికను పునరుద్దరించే విధంగా శస్త్రచికిత్స చేస్తారు. ఈ సర్జరీ ద్వారా దెబ్బతిన్న కార్టిలేజ్, ఎముక ఉపరితలాన్ని తొలగించడంతోపాటు ఎముక-లిగమెంట్ నష్టం వల్ల ఏర్పడే పరిస్థితిని సరిచేస్తారు. మార్పిడికి ఉపయోగించే కృత్రిమ కీళ్లను టైటానియం, కోబాల్ట్ క్రోమ్, స్టెయిన్లెస్ స్టీల్ లాంటి లోహాలతోనూ లేదా సిరామిక్-ప్లాస్టిక్ (పాలీయిథలిన్) లాంటి పదార్థాలతో తయారుచేస్తారు. ఈ కీలును ఎక్రిలిక్ సిమెంట్‌తో ఎముకకు అతికిస్తారు. కొన్నిసార్లు నొక్కి ఎముకకు బిగిస్తారు. తరువాత ఫిజియోథెరపీ ద్వారా వ్యక్తికి తన కొత్త కీలును కదిలించేలా, ఉపయోగించేలా అలవాటు చేస్తారు.
మోకాలు కీలు మార్పిడి సర్జరీ చేయించుకున్న వారిలో మొదటి మూడు నెలల్లోనే చాలా మార్పు కనిపిస్తుంది. నొప్పి మటుమాయం అవుతుంది. శస్త్రచికిత్స జరిగిన మర్నాడే లేచి నిలబడటం, కీలు కదిలించడం సాధ్యపడుతుంది. ఆ తర్వాత ఆరు వారాలలో చాలామంది రోగులు స్వేచ్ఛగా, ఎటువంటి ఆధారం లేకుండా నడిచే అవకాశం ఏర్పడుతుంది. కండరాలు దృఢపడిన తరువాత పరుగులు తీయడం, దూకడం మినహా సాధారణ, రోజువారీ పనులు సునాయాసంగా చేసుకోగలుగుతారు. దాదాపు 85 శాతం కృత్రిమ కీళ్లు- ఇంప్లాంట్లు 20 ఏండ్ల వరకు పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు మెరుగు పడుతున్న కీళ్ల డిజైన్లు, వాటిని అమర్చే విధానాల వల్ల వీటి జీవితకాలం మరింత పెరుగుతూ వస్తున్నది.
– డాక్టర్ కీర్తి పాలడుగు
సీనియర్ ఆర్థోపెడిక్,
జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్
యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ
హైదరాబాద్