‘ఆ యువకుడికి పాఠశాల రోజుల నుంచే దేశభక్తి ఎక్కువ. దేశం కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో ఉంటాడు. పెరిగి పెద్దయ్యాక గూఢచారిగా దేశ రక్షణకు నడుంబిగిస్తాడు. శత్రు దేశపు కుతంత్రాలను, దుష్ట పన్నాగాలను తన వ్యూహాలతో తిప్పికొడతాడు. ఈ క్రమంలో అతను సాగించిన సాహసోపేతమైన పయనం ఏమిటన్నదే మా సినిమా కథ’ అని అన్నారు సురేందర్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో అఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’. మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాక్షి వైద్య కథానాయిక. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేయబోతున్నారు. ‘దేశభక్తి అంశాలతో తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి స్వాతంత్య్ర దినోత్సవానికి మూడు రోజుల ముందుగా ప్రేక్షకులముందుకు తీసుకొస్తున్నాం. స్పై థ్రిల్లర్గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది. ఆయన లుక్స్ ైస్టెలిష్గా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రగుల్ హెరియన్ ధరుమన్, సంగీతం: హిప్హాప్ తమిళ, నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా, సహనిర్మాతలు: అజయ్ సుంకర, పత్తి దీపారెడ్డి, దర్శకుడు: సురేందర్ రెడ్డి.