లక్నో : టమాట ధరలు రికార్డు స్దాయికి చేరడంతో తన రిటైల్ స్టోర్‌లో టమాట నిల్వలను కాపాడేందుకు బౌన్సర్లను పెట్టిన సమాజ్‌వాదీ నేత వీడియో వైరల్ కావడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కూరగాయల విక్రేతతో పాటు ఆయన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ నేత అజయ్ ఫౌజీ పరారీలో ఉన్నాడు.
ఇక వైరల్ వీడియోలో వారణాసిలోని లంక ప్రాంతంలో కిరాణా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అజయ్ ఫౌజీ టమాట ధరలపై బేరసారాలు సాగించే క్రమంలో వినియోగదారులు దూకుడుగా వ్యవహరించకుండా ఉండేందుకు ఇద్దరు బౌన్సర్లను నియమించానని చెప్పడం కనిపిస్తుంది. ఇక అరెస్టయిన కూరగాయల విక్రేతను జగనరాయణ్ యాదవ్, ఆయన కుమారుడు వికాస్ యాదవ్‌గా గుర్తించారు.
వీరిద్దరూ ఎస్పీ నేత దుకాణంలో పనిచేస్తున్నారు. టమాట ధరలపై వినియోగదారులు వాదనలకు దిగుతూ దూకుడుగా వ్యవహరించడాన్ని నిరోధించేందుకు తాను ఈ ఏర్పాట్లు చేశానని వీడియోలో అజయ్ ఫౌజీ చెప్పుకొచ్చారు. ఫౌజీ తన దుకాణంలో టమాటను కిలో రూ. 140-160కి విక్రయిస్తున్నాడు. బౌన్సర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దుకాణంలో పనిచేస్తున్నారు. కాగా వీరికి రోజుకు ఎంత చెల్లిస్తున్నారనే వివరాలను ఫౌజీ వెల్లడించలేదు. మరోవైపు టమాటలకు బీజేపీ ప్రభుత్వం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని ఫౌజీ ఆయన బౌన్సర్ల ఫొటోలను ట్వీట్ చేసిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కోరారు.
Read More :