హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): వరుస లోపాలు, మరమ్మతులు, సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న శ్రీశైలం నాలుగో యూనిట్ ఎట్టకేలకు ప్రారంభానికి సిద్ధమైంది. అగ్నిప్రమాదం తర్వాత నిలిచిపోయిన నాలుగో యూనిట్ విద్యుత్తు ఉత్పత్తికి సమాయత్తమైంది. సుమారు ఆరేండ్ల తర్వాత 150 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైంది. మరమ్మతుల్లో ఉన్న ఈ యూనిట్‌ను ఎట్టకేలకు మంగళవారం గ్రిడ్‌తో సింక్రనైజ్ చేశారు. 2020 ఆగస్టు 20న ఈ యూనిట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అనంతరం మరమ్మతులు చేపట్టారు. 2023లోనూ అంతరాయం ఏర్పడింది.
80 గంటలు నడిచిన తర్వాత మళ్లీ నిలిచిపోయింది. మరమ్మతులు చేపట్టగా 2025 అక్టోబర్ 2న మళ్లీ విద్యుత్తు ఉత్పత్తిని మొదలు పెట్టగా సుమారు 10 గంటలు నడిచిన తరువాత ఎయిర్ గ్యాప్ ప్రొటెక్షన్ కారణంగా మళ్లీ ట్రిప్ అయింది. పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టి ప్రీ-కమిషనింగ్ పరీక్షలు పూర్తి చేసి, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ నుంచి జనరేటర్ చార్జింగ్కు అనుమతి తీసుకున్నారు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున 3.21 గంటలకు యూనిట్-4ను గ్రిడ్‌కు సింక్రనైజ్ చేశారు. ట్రయల్ రన్లో భాగంగా 72 గంటలపాటు నిరంతరాయంగా ఈ ప్లాంట్ నడిస్తే అవాంతరాలను అధిగమించినట్టు అవుతుంది.