Afghanistan floods | తూర్పు అఫ్గానిస్తాన్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సంభవించిన వరదల వల్ల సుమారు 20 మంది మరణించారని, మేయర్‌తో సహా 100 మంది గల్లంతయ్యారని అఫ్గానిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ కమిటీకి చెందిన యూసఫ్ హమ్మద్ ప్రకటించారు. ఆ దేశంలోని నూరిస్తాన్ ప్రావిన్స్ రాజధాని పరున్ నగరం ఈ వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నది. వరదల్లో గల్లంతైన వారిలో ఈ పరున్ నగర మేయర్ కూడా ఉన్నారు. అలాగే 80 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా భారీ ఆర్థిక, ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇళ్లు, దుకాణాలు, మున్సిపల్ భవనాలు ధ్వంసమయ్యాయి.
తుఫానులు, కరవులతో సహా ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పుల ప్రభావానికి తీవ్రంగా గురయ్యే దేశాల్లో అఫ్గానిస్తాన్ ఒకటి. అలాగే ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో కూడా ఒకటి. ఇప్పుడీ వరదలకు పరున్ మున్సిపాలిటీ పూర్తిగా ద్వంసమైందని అక్కడి ఓ ఎన్జీవో ష్పౌల్కు నాయకత్వం వహిస్తున్న అషిఖుల్లా సఫి వార్తా సంస్థలకు వెల్లడించారు. సహాయక చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.
అఫ్గానిస్తాన్‌లో ఈ బుధవారం వరకు భారీ వర్షాలు, వరదలు కొనసాగుతాయని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనివల్ల ఆ దేశంలోని 10 ప్రావిన్స్‌లు ఈ వరదలకు గురయ్యే అవకాశం ఉందని, ఆ ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు.
అటవీ నిర్మూలనే కారణం
సూరిస్తాన్ ప్రావిన్స్ దట్టమైన అడవులు, శిఖరాలు, నదులతో పర్యావరణంతో అలరారేది. దీంతో దీన్ని 2020లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. కానీ సూరిస్తాన్తో పాటు ఇతర ప్రావిన్సుల్లో అటవీ నిర్మూలన, అక్రమంగా కలప నరికివేత వల్ల భూమి బలహీనపడి వర్షాన్ని గ్రహించే సామర్థ్యం తగ్గింది. దీంతో వరదలు సంభవిస్తున్నాయని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కాబట్టి ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా సహజ వనరులను కాపాడుకోవాలని, లేకపోతే ఇలా వరదలతో ఆర్థిక, ప్రాణ నష్టాలు సంభవిస్తాయని హెచ్చరించాయి.