కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత అక్కడి ప్రజల హక్కులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మహిళల జీవితాలు, భవిష్యత్‌పై తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆఫ్ఘన్‌ను ఆక్రమించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో తాలిబన్లు తమ దేశ ప్రజలకు మేలు చేస్తామని, వారి జీవితాలను మెరుగుపరిచే దిశగా చర్యలు చేపడుతామన్నారు. మహిళలకు ఇస్లామిక్ చట్టాల ప్రకారం హక్కులు కల్పిస్తామన్నారు. ఇకపై తమ పాలనలో మహిళా బాధితులుండరన్నారు. తొలుత ఈ మాటలు కాస్త ఉదారంగా కనిపించినప్పటికీ.. వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నది.
తాజాగా షబ్నమ్ ఖాన్ దవ్రాన్ అనే మహిళా జర్నలిస్ట్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆఫ్గన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్టీఏ టీవీ ఛానెల్లో ఆమె పని చేస్తున్నారు. ఇటీవల ఎప్పటిలాగే తాను పనిచేసే టీవీ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది తనను అనుమతించలేదంటూ సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పురుష జర్నలిస్టులను మాత్రమే అనుమతించారని, తన ఐడీ కార్డ్ చూపినా.. అనుమతించలేదని చెప్పారు. తాలిబన్లు ఆఫ్గన్‌ను ఆక్రమించుకోవడంతో వ్యవస్థ మారిపోయిందని.. ఇకపై మహిళా జర్నలిస్టులను అనుమతించట్లేదని చెప్పినట్లు తెలిపారు. ‘నా మాటలు వింటున్నవారు.. ఒకవేళ ప్రపంచం నా మాటలు వింటుంటే.. దయచేసి మాకు సహాయం చేయండి.. మేం ఆపదలో ఉన్నాం.. మా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది’ అని షబ్నమ్ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఆఫ్ఘన్‌ను ఆక్రమించిన అనంతరం షరియా చట్టాలకు లోబడి మహిళలకు హక్కులు ఉంటాయని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యతో పాటు ఎడ్యుకేషన్, హెల్త్, తదితర రంగాల్లో ఉద్యోగాలు చేసేందుకు అనుమతి ఉంటుందన్నారు. తాజా పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగానే ఉన్నాయి. గత జూలైలోని కాందహార్‌లోని ఓ బ్యాంకులోకి చొరబడ్డ తాలిబన్లు.. అక్కడ పనిచేస్తున్న తొమ్మిది మంది మహిళా ఉద్యోగులను ఇంటికి పంపించి వేసిన సంగతి తెలిసిందే. మళ్లీ ఉద్యోగాలకు రావొద్దని.. వారి స్థానంలో కుటుంబంలోని మగవారిని పంపించాలని హుకూం జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గతంలో తాలిబన్లు సాగించిన అరాచకాలు మరోసారి పునరావృతమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
Please RT and share with your networks to get one of Afghanistan’s many, brave female journalists @shabnamdawran some help. Shabnam courageously showed up to work today at @RTA, Afghan national television. She was denied entrance into her office by the Taliban and told to go home https://t.co/CICnMAOS3h
— Elise Labott (@EliseLabott) August 18, 2021