
అధికార పార్టీ మరోసారి సత్తా చాటింది. ఊహించినట్లుగానే మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నది. గురువారమే గెలుపు ఖరారైనా.. నిబంధనల మేరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వెంకట్రావు, ఎన్నికల పరిశీలకుడు శ్రీధర్ అధికారికంగా ప్రకటించారు. అనంతరం కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్‌రెడ్డికి గెలుపు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేలు వారికి శుభాకాంక్షలు తెలిపారు. రెండో సారి ఎమ్మెల్సీలుగా ప్రజాసేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి
కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. తమ గెలుపునకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్ నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికలు ఏవైనా గెలుపు అధికార పార్టీదేనని ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వచ్చిన అధికార పార్టీ ప్రస్తుతం జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను సైతం ఏకగ్రీవంగా కైవసం చేసుకుందన్నారు. ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎంపికైన కశిరెడ్డి, కూచకుళ్ల గెలుపు ధ్రువీకరణ పత్రాలను అందుకున్న తర్వాత కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ గెలుపు సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఫలమేనని మంత్రి పేర్కొన్నారు. 70 ఏండ్ల సమైక్య పాలన, 7ఏండ్ల స్వరాష్ట్ర పాలన చూస్తేనే ఇలాంటి గెలుపుకు అధికార పార్టీ ఎందుకు అర్హమైనదో అర్థం అవుతుందన్నారు. సమైక్య రాష్ట్రంలో సాగు, తాగు నీటి సమస్యలతో పాటు విద్యుత్ సంక్షోభం ఉండేదన్నారు. అందుకే అప్పట్లో ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తిరిగేందుకే జంకే పరిస్థితి ఉండిదన్నారు. కానీ స్వరాష్ట్రం సిద్ధించాక దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఉపాధి కోసం ముంబయి వెళ్లేందుకు బస్సులు కావాలని ధర్నాలు చేస్తే… ఇప్పుడు ఇతర రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం తెలంగాణ వచ్చేంతగా అభివృద్ధి జరిగిందని… ఇదంతా సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే సాధ్యమైందన్నారు. అభివృద్ధిని చూసిన ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ అధికార పార్టీకే పట్టం కడుతూ వచ్చారన్నారు. అందుకే ఉమ్మడి జిల్లాలో 90శాతానికి పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ వారే ఉన్నారని తెలిపారు. అదిచూసే తమ వల్ల కాదని కనీసం ప్రతిపక్షాలు పోటీ చేసేందుకు సైతం ప్రయత్నించలేదన్నారు. పోటీ చేసిన స్వతంత్రులు సైతం అధికార పార్టీ గెలుపును అడ్డుకోవడం తమ వల్ల కాదని గుర్తించి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని మంత్రి అన్నారు. కశిరెడ్డి, కూచకుళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించిన వారందరికీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ నేతలు చేసిందేమీ లేకపోయినా అనవసరంగా ప్రగల్భాలు పలుకుతున్నారని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గెలుపు తమదేనని బీజేపీ నేత తరుణ్ చుగ్ అన్నారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి ఘాటుగా స్పందించారు. వాళ్లు రాష్ర్టానికి ఏం చేశారని ప్రజలు వారిని ఎన్నుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణలో పథకాలు బాగున్నాయని ఓవైపు కేంద్ర మంత్రులే పొగుడుతున్నారని…రాష్ట్రంలో అమలవుతున్న ఒక్క పథకమన్నా బీజేపీ పాలిత రాష్ట్రంలో అమలవుతున్నదా అని మంత్రి ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, టీఆర్ఎస్ నేత జూపల్లి భాస్కర్ రావు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి
రెండోసారి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. తన విజయంలో కీలక పాత్ర వహించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఏకగ్రీవం అయ్యిందంటే అందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, అందరి సహకారం వల్లేనని కశిరెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ వల్లే ఉమ్మడి జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఒకప్పుడు వ్యవసాయం దండగ అంటే ఇప్పుడు పండుగ అని టీఆర్ఎస్ సర్కారు నిరూపిస్తున్నదన్నారు. ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమాతో తెలంగాణ రైతులు వ్యవసాయంలో ముందుకు సాగుతున్నారని తెలిపారు. అన్ని రంగాల్లో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉందని… ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తానని కశిరెడ్డి నారాయణరెడ్డి స్పష్టం చేశారు.
ఇదే సర్కారు కలకాలం ఉండాలి..
ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి
సమైక్య రాష్ట్రంలో కరెంటు లేక, పండిన పంటను అమ్ముకునే పరిస్థితి లేక అన్నదాతలు ఆగమయ్యారని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని నూతన ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రస్తుతం ఉన్న సీఎం కేసీఆర్ సర్కారే కలకాలం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్సీగా తాను మరోసారి విజయం సాధించేందుకు కారణమైన సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడేండ్ల క్రితం వలసల జిల్లాగా ఉన్న మహబూబ్‌నగర్ రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. అప్పుడు వలస పోయిన వారు ఇప్పుడు తిరిగి రావడమే కాకుండా ఇతర ప్రాంతాల వాళ్లు వలస వస్తున్నారన్నారు. మహబూబ్‌నగర్‌లో 15రోజులకు ఓసారి నీళ్లు వచ్చేవని.. ఇక్కడే ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇప్పటి మార్పును జనం గుర్తిస్తున్నారని తెలిపారు.
రెండు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
మహబూబ్‌నగర్, నవంబర్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఊహించినట్లుగానే అధికార పార్టీ తన సత్తా చాటింది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. గురువారమే గెలుపు ఖరారైనా..నిబంధనల మేరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 3గంటల తర్వాత రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వెంకట్రావు, ఎన్నికల పరిశీలకులు శ్రీధర్ రెండు స్థానాలను ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కశిరెడ్డి నారాయణ రెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డికి గెలుపు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. వారివెంట మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి తదితరులున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్..నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు కశిరెడ్డి, కూచకుళ్ల కృతజ్ఞతలు తెలిపారు. తమ గెలుపునకు సహకరించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, హరీశ్‌రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి అందరితో కలిసి పనిచేస్తామని ఎమ్మెల్సీలు ఈ సందర్భంగా వెల్లడించారు.
ఏకగ్రీవంతో పెరిగిన ప్రతిష్ట
ఉమ్మడి జిల్లాలో ఏ ఎన్నికలైనా గెలుపు మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీదే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, సర్పంచ్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ..ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ..ఇలా అన్ని ఎన్నికల్లోనూ అధికార పార్టీకి ఎదురే లేకుండా పోయింది. స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలు కనీసం సందడి చేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కనీసం మాట్లాడలేదు. తమకు అవకాశమే లేని చోట పోటీకి ప్రతిపక్షాలు జంకి దూరంగా ఉన్నాయి. అయితే పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ కోసం ప్రయత్నాలు చేశారు. వీరిలో ఆరుగురి నామినేషన్లే చెల్లుబాటు కాలేదు. ఇక నామినేషన్లు చెల్లుబాటు అయిన ఇద్దరు స్వతంత్రులు సైతం పోటీ నుంచి విరమించుకున్నారు. అధికార పార్టీ ఓటర్లే 90శాతానికి పైగా ఉండటంతో గెలుపు ముందే నిర్ణయమైనా… స్వతంత్ర అభ్యర్థులిద్దరూ తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం సాధ్యమైంది. దీంతో వచ్చే నెల 10న జరిగే ఎన్నిక కోసం ఎదురుచూడాల్సిన అవసరమే లేకపోయింది. మరోవైపు రెండు ఎమ్మెల్సీ స్థానాలు సైతం ఏకగ్రీవం అవ్వడం వల్ల ఉమ్మడి జిల్లా ప్రతిష్టను మరింతగా పెరిగేందుకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు చేసిన ప్రయత్నం గొప్పదని పార్టీ నేతలు చెబుతున్నారు.