Adipurush Movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush ). సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులు సినిమాను ఆలస్యంగా ప్రదర్శన చేశారని ఓ థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని జ్యోతి థియేటర్లో జరిగిందీ ఈ ఘటన.
సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో గొడవకు దిగిన అభిమానులు.. థియేటర్ యాజమాన్యం సర్ది చెప్పడంతో సద్దుమణిగారు. అయితే, సినిమా ప్రారంభమయ్యాక సౌండ్ సిస్టం సరిగా లేక, డైలాగులు అర్థం కావడం లేదంటూ అభిమానులు మళ్లీ గొడవకు దిగారు. ఆగ్రహంతో ఊగిపోతూ థియేటర్ అద్దాలను పగలగొట్టారు. దీంతో థియేటర్ యాజమాన్యం సినిమా ప్రదర్శనను నిలిపివేసింది.