
అన్నదాత పక్షాన రాష్ట్ర సర్కారు రణభేరి మోగించింది. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు దిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్, బోథ్, ఖానా పూర్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, రేఖానాయక్ తదితర ప్రజాప్రతినిధులు దండుగా వెళ్లి హోరెత్తించారు. కేంద్రం యాసంగి ధాన్యం కొంటదా? కొనదా? స్పష్టతనివ్వాలని సీఎంతో కలిసి నిరసన గళమెత్తారు. ‘తొండి మాటలు ఆపండి.. వడ్లు వెంటనే కొనండి’ ‘పంజాబ్ వడ్లు కొంటరెట్ల.. తెలంగాణ వడ్లు కొనరెట్ల’ వంటి ప్లకార్డులు పట్టుకుని కేంద్ర సర్కారుకు వ్యతి రేకంగా నినదించారు. బీజేపీ సర్కారు ఈ ప్రాంత రైతులపై వివక్ష చూపుతున్నదని, దిగి వచ్చే దాకా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఆదిలాబాద్, నవంబర్ 18 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణలో పండించిన ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన మహా ధర్నాలో ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి, ఎమ్మెల్సీ, విప్, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా ఆందోళన నిర్వహించారు. ‘కదిలింది రైతులోకం.. బీజేపీకి తప్పదిక శోకం’ అనే నినాదంతో ఉన్న ప్లకార్డును అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ రఘునందన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మంచిర్యాల జిల్లా నుంచి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్‌కుమార్, ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, సిర్పూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్‌రావు, ఆదిలాబాద్ , బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు కేంద్ర సర్కారు పంజాబ్‌లో పండించిన వడ్లు కొంటూ.. తెలంగాణపై వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. కేంద్రం దిగివచ్చే వరకూ ఆందోళనలు కొనసాగుతాయన్నారు.