
సిరికొండ,నవంబర్ 18:గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించి, ప్రజలకు ఉపాధి కల్పించడమే ఉపాధి హామీ ముఖ్య ఉద్దేశం. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23లో చేపట్టే పనుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం మండలంలోని ప్రతీ పంచాయతీలో గ్రామసభలు నిర్వస్తున్నారు. ఇందులో గ్రామస్తులు తమకు అవసరమైన పనులు ఎంపిక చేసుకోవచ్చు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏటా పనులను గుర్తించడం అనవాయితీ. రాష్ట్ర ప్రభుత్వం 56 రకాల పనులను గుర్తించి ప్రణాళికలు రూపొందించి వాటికి నిధులు విడుదల చేస్తున్నది.
గ్రామసభనే కీలకం..
మండలంలోని ప్రతి పంచాయతీలో ఇటీవల ఉపాధి హామీ గ్రామసభలు నిర్వహించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏయే పనులు చేయాలో చర్చించారు. ఎంపీపీ, జడ్పీటీసీ,సర్పంచ్, వార్డు సభ్యులు,ఐకేపీ,ఉపాధి హామీ కూలీలు, ఏపీవో, టెక్నకల్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు చర్చలో పాల్గొని పనులను గుర్తించారు. ఉపాధి హామీ నిధులు దక్కాలంటే గ్రామసభలో గుర్తించిన పనులే కీలకం కానున్నాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న సభల్లో కూలీలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై గ్రామాభివృద్ధి, వ్యక్తిగత పనులతో పాటు రైతులు తమ పంట చేలలో అవసమైన వాటిని గుర్తించవచ్చు. గ్రామసభల ఆమోదం లభించిన వెంటనే పనులు చేపట్టే వీలుంటుంది. ఒకవేళ సభలకు హాజరు కాకుండా వివరాలు నమోదు చేయకపోతే మరో ఏడాది పాటు నిరీక్షించాల్సి ఉంటుంది.
వివిధ రకాల పనులు…
ఉపాధి హామీ పథకం కింది 56 రకాల పనులు చేపట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానంగా పంట చేలలో నీటి కుంటలు, కందకాలు, తవ్వకం, పూడికతీత, పశువుల పాకలు, పంట కల్లాలు, పశుగ్రాసం పెంపకం, పండ్ల తోటలు, గట్లపై టేకు చెట్ల పెంపకం, వర్షపు నీటి మళ్లింపు కాలువలు, జంజరు భూములను సాగుయోగ్యంగా మార్చడం, రహదారులు, మట్టిరోడ్లు, శ్మశాన వాటికల అభివృద్ధి, నర్సరీల నిర్వహణ, హరితహారం మొక్కల సంరక్షణ, పంచాయతీ, అంగన్ వాడీ భవనాల నిర్వహణ, చెరువుల నిర్మాణం, పూడికతీత పనులను గ్రామసభల్లో ఎంపిక చేయవచ్చు.
గ్రామ సభ ఆమోదంతోనే
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నాం. సభలోల్లో ఆమోదించిన పనులనే చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈజీఎస్ ద్వారా కేటాయించిన నిధులన్నీ వినయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించేందుకు చర్య లు చేపడుతున్నాం. జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి పని కల్పించేలా అవగాహన కల్పిస్తున్నాం.
సురేశ్, ఎంపీడీవో, సిరికొండ