
మామడ, నవంబర్ 2 : రైతు సంక్షేమయే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని న్యూసాంగ్వి గ్రామంలో మంగళవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ సీజన్లో జిల్లాలో 1.15 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారన్నారు. 27 లక్షల క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులు వరి పంటలకు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని సూచించారు. యాసంగిలో ఆయిల్ పామ్ సాగుపై దృష్టిపెట్టాలన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని అనేక సంక్షేమ పథకాలను రాష్ట్రంలో తెలంగాణ సర్కారు అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు. ఇల్లు లేని వారు సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తున్నదన్నారు. అనంతరం న్యూసాంగ్వి గ్రామానికి చెందిన షేక్ ఫారూఖీ రెండు రోజుల క్రితం మృతిచెందగా, రైతు బీమా కింద మంజూరైన రూ.5 లక్షల చెక్కును ఆయన భార్య అక్తరీకి మంత్రి అందజేశారు. అనంతరం న్యూ సాంగ్వి కస్తూర్బా పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, డీసీసీబీ మాజీ చైర్మన్ కొరిపెల్లి రాంకిషన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ చిక్యాల హరీశ్‌రావు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ పాకాల చంద్రశేఖర్‌గౌడ్, డీసీవో శ్రీనివాస్‌రెడ్డి, డీఎం సాయికళ, ఎంపీడీవో మల్లేశ్, తహసీల్దార్ కిరణ్మయి, ఏవో నాగరాజు, ఉప సర్పంచ్ అశ్విన్‌రెడ్డి, మామడ సర్పంచ్ హన్మాగౌడ్, నాయకులు జైసింగ్, సంతోష్, వికాస్‌రెడ్డి, నల్ల లింగారెడ్డి, భాస్కర్‌రావు, ముత్యంరెడ్డి, అలీం, శశికాంత్‌రెడ్డి, కైలాస్, రఘ తదితరులు పాల్గొన్నారు.