ఆదిభట్ల, మే 28 : ఏడు గుంటల భూమిని తమ పాసుపుస్తకాలలో ఎక్కించడానికి ఓ రైతు నుంచి రూ. 12 లక్షలు డిమాండ్ చేసిన ఓ ఆర్ఐ అడ్డంగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెల్తే ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లకు చెందిన మ్మిడి శ్రీశైలం, ఇమ్మిడి బాలయ్య, ఇమ్మిడి ఐలయ్య ముగ్గురు అన్నాదమ్ములు. వీరికి సర్వే నెంబర్ 355లో కొంత భూమి ఉంది. శ్రీశైలానికి 17 గంటలు, బాలయ్యకు 17 గుంటలు, ఐలయ్యకు 17 గుంటల భూమి ఉంది. అయితే ఐలయ్య తన 17 గుంటల భూమిని అమ్ముకున్నాడు. అప్పట్నుంచి ఆ అన్నాదమ్ముళ్ల మధ్య విబేధాలు మొదలయ్యాయి. తమకు 7 గుంటల భూమి తక్కువగా వస్తుందని ఇమ్మడి శ్రీశైలం కొడుకు బాలకృష్ణ కొంతకాలంగా ఆరోపిస్తున్నాడు. ఎలాగైనా సర్వే నెంబర్ 355లో ఉన్న భూమిలో 7 గుంటల తమ పేరుపైకి ఎక్కించాలని స్థానిక ఆర్ఐ కృష్ణను బాలకృష్ణ సంప్రదించాడు.
పాసు పుస్తకాల్లో ఏడు గుంటల భూమిని ఎక్కించడానికి ఆర్ఐ కృష్ణ ముందుగా 12 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. అయితే బాలకృష్ణ అంత ఇవ్వలేనని చెప్పడంతో చివరకు 9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం రైతుల భూమిని ఆర్ఐ రికార్డుల్లోకి ఎక్కించాడు. అనంతరం తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని ఆర్ఐ రైతులను అడిగాడు. డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, ఆర్డీవోకు తాను డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని.. వెంటనే ఆ మొత్తం డబ్బు చెల్లించాలని రైతును వేధించాడు. దీంతో ఆ డబ్బులు ఇవ్వలేక బాలకృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం నాడు కాపుకాసిన ఏసీబీ అధికారులు.. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ కృష్ణను పట్టుకున్నారు. దీనిపై డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్‌ను కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.