కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 04 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఈవిఎంల గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ గురువారం తనిఖీ చేశారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి చేపట్టిన ఈకార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాం తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి తెల్సుకున్నారు.
అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈవీఎం గదుల, వీవీప్యాట్ గదుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, ఇతర పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్, నాంపల్లి శ్రీనివాస్, బర్కత్ అలీ, కళ్యాడపు ఆగయ్య, సిరిసిల్ల అంజయ్యతో పాటు ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.