Adani | న్యూఢిల్లీ, డిసెంబర్ 30: భారతీయ బహుళ వ్యాపార, పారిశ్రామిక రంగ దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్.. ఎఫ్ఎంసీజీ జాయింట్ వెంచర్ అదానీ విల్మర్ నుంచి తప్పుకుంటున్నది. అందులో ఉన్న మొత్తం వాటాను దాదాపు రూ.17,100 కోట్ల (2 బిలియన్ డాలర్లు)కు అమ్మేస్తున్నట్టు సోమవారం గ్రూప్ ప్రకటించింది. దీంతో ఎఫ్ఎంసీజీ రంగానికే అదానీ గుడ్‌బై చెప్పేస్తుండటం గమనార్హం. నిజానికి ప్రతీ రంగంలోనూ ఆయా కంపెనీలను హస్తగతం చేసుకుంటూ తన ఉనికిని విస్తరిస్తూపోతున్న అదానీ గ్రూప్.. ఇలా రెండున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న సంస్థను వదులుకుంటూ ఏకంగా ఓ రంగం నుంచే వైదొలుగుతుండటం మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నదిప్పుడు.
1999లో..
సుమారు 25 ఏండ్ల క్రితం 1999 జనవరిలో సింగపూర్‌కు చెందిన కమోడిటీ ట్రేడర్ విల్మర్‌తో కలిసి అదానీ గ్రూప్ ఈ అదానీ విల్మర్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రస్తుతం అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు 43.94 శాతం వాటా ఉండగా, దీనంతటినీ తమ భాగస్వామి విల్మర్ ఇంటర్నేషనల్కే అదానీ గ్రూప్ విక్రయిస్తున్నది. 31.06 శాతం వాటాను రూ.12,314 కోట్లకు అమ్ముతున్న అదానీ.. కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ అవసరాలకు అనుగుణంగా మరో 12.88 శాతం వాటాను ఓపెన్ మార్కెట్లో దాదాపు రూ.4,786 కోట్లకు విక్రయిస్తున్నది. కాగా, గౌతమ్ అదానీ, ఆయన సంస్థపై అమెరికాలో లంచం నేరారోపణలు వచ్చిన దగ్గర్నుంచి అదానీ గ్రూప్‌లో జరుగుతున్న బిగ్ డీల్ ఇదే. వచ్చే ఏడాది మార్చి 31కల్లా ఈ లావాదేవీ పూర్తికావచ్చన్న అంచనాలున్నాయి.
ఏఈఎల్‌కు దన్ను
అదానీ విల్మర్‌లో వాటాలను అమ్మేస్తున్న అదానీ గ్రూప్.. ఇలా వస్తున్న నిధులను కీలక మౌలిక వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టబోతున్నది. దీంతో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్)కు మరింత దన్ను లభించనున్నది. ఎనర్జీ, యుటిలిటీ, రవాణా, లాజిస్టిక్స్ తదితర విభాగాల్లో అదానీ పట్టును పెంచుకోవడానికి ఈ సొమ్మును వాడుకోబోతున్నట్టు కంపెనీ తాజా ప్రకటన ద్వారా తెలియవస్తున్నది. ఫలితంగా ఏఈఎల్ సామర్థ్యం మరింతగా పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ముఖ్యంగా విమానాశ్రయాలు, అదానీ డిజిటల్ వంటి వాటిపై ఇంకా శ్రద్ధ పెట్టవచ్చని కూడా అదానీ గ్రూప్ భావిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.