ముంబై, ఏప్రిల్ 27: దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ సిమెంట్ రంగంలో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రేవులు, ఎనర్జీ, గనుల రంగాల్లో తనదైన సత్తాచాటుతున్న అదానీ గ్రూపు వ్యవస్థాపకుడు క్రమంగా తన పంతాను మార్చుకుంటున్నారు. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్‌లో హోల్సిమ్కు ఉన్న వాటాను కొనుగోలు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తున్నది.
భారత వ్యాపారానికి గుడ్‌బై పలుకుతున్నట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 9.6 బిలియన్ డాలర్ల విలువైన అంబుజా సిమెంట్‌ను కొనుగోలు చేయడానికి జేఎస్‌డబ్ల్యూ, ఆదిత్యా బిర్లా సంస్థలు కూడా ముందుకొచ్చాయి కూడా. అంబుజాను కొనుగోలు చేసిన సంస్థ చేతిలోకి ఏసీసీ సిమెంట్ కూడా వశంకానున్నది.
ఏసీసీలో అంబుజాకు మెజార్టీ వాటా ఉండటమే ఇందుకు కారణం. దీనిపై ఇప్పటి వరకైతే అధికారిక ప్రకటన రాలేదు.కానీ, హోల్సిమ్, జేఎస్‌డబ్యూ గ్రూపు ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి నిరాకరించగా..కానీ, అదానీ, అంబుజా వర్గాలు స్పందించడానికి నిరాకరించారు.
మరోవైపు, అంబుజా సిమెంట్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రూ.3,500 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు కానున్నది. అంబుజా సిమెంట్‌ను విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలతో ప్రస్తుత నెలలో కంపెనీ షేరు ధర ఏకంగా 26 శాతం ఎగబాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లకు చేరుకన్నది. సంస్థలో హోల్సిమ్కు 63.10 శాతం వాటా కలిగి ఉన్నది.