అగ్ర కథానాయిక తమన్నా జోరుమీదుంది. కెరీర్లో మంచి విజయాలు అందుకుంటూనే మరోవైపు భారీ సినిమా అవకాశాలతో సత్తాచాటుతున్నది. ‘సీటీమార్’ ‘మాస్ట్రో’ చిత్రాల ద్వారా ఈ ఏడాది తెలుగులో సక్సెస్ అందుకున్న ఈ మిల్కీబ్యూటీ అదే దూకుడుతో తదుపరి చిత్రాల కోసం సన్నద్ధమవుతున్నది. తాజాగా ఈ భామ చిరంజీవి సరసన మరోమారు నటించే బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది. చిరంజీవి కథానాయకుడిగా మోహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ నెల 11న లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను ఎంపిక చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘సైరా’ తర్వాత ఈ అమ్మడు చిరంజీవితో నటించబోతున్న రెండో చిత్రమిది కావడం విశేషం. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కించనున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతాన్నందించనున్నారు. 2022లో ప్రేక్షకులముందుకురానుంది.