
ప్రతిరోజు ఒకే తరహాలో గడిచే జీవితం అంటే బోర్కొడుతుందని..అనునిత్యం కొత్తదనాన్ని అన్వేషించాలనుకునే ఉద్దేశ్యంతో సినీరంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నానని చెప్పింది బెంగళూరు సోయగం నభానటేష్. ‘నాకు చిన్నతనం నుంచే నృత్యం, నటన అంటే చాలా ఇష్టం. సినిమాలపై అభిరుచితో కాలేజీ చదువు పూర్తికాగానే మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నా. ప్రతిరోజు ఉదయాన్నే పరుగుపరుగున ఆఫీసుకు వెళ్లి కంప్యూటర్ ముందు కాలం గడిపే జీవితాన్ని అస్సలు వొద్దనుకున్నా. నా లక్ష్యానికి తల్లిదండ్రులు కూడా అండగా నిలవడంతో నా సినీ ప్రయాణం సాఫీగా సాగుతున్నది’ అని చెప్పింది.
నటనాపరంగా భవిష్యత్తులో ప్రయోగాలకు ప్రాధాన్యతనివ్వాలని నిశ్చయించుకున్నానని నభానటేష్ తెలిపింది. ‘నేను థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. పాత్రలపరంగా ప్రయోగాలు చేయాలనే తపన ఉంది. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్‌తో కూడుకున్న పాత్రల ద్వారా నాలోని కొత్తకోణాల్ని ఆవిష్కరించుకోవాలనుకుంటున్నా’ అని ఆమె పేర్కొంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో కుర్రకారు హృదయాల్ని దోచుకున్న ఈ సుందరి తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నది.