నటన గురించి తెలియకుండానే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మూవీలో చాన్స్ కొట్టేసిన నటి మౌనిక. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి సినిమాలు, సీరియల్స్‌తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలం తెరకు దూరమైనా తన మనసు మాత్రం ఎప్పుడూ నటనపైనే ఉందంటున్నది. తన అమాయకత్వంతో తొలి సీరియల్‌తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘మధు’ అంటే తెలుగునాట తెలియని వారుండరు. జీ తెలుగు ‘అమ్మాయిగారు’ సీరియల్‌తో రీ ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను మళ్లీ అలరిస్తున్న మౌనిక జిందగీతో పంచుకున్న ముచ్చట్లు..
‘అతడు’ సినిమాలో చాన్స్ వచ్చినప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. నాకు యాక్టింగ్ గురించి అస్సలు తెలియదు. సినిమాలు, సీరియల్స్‌కి తేడా కూడా తెలియదు. అనుకోకుండా అవకాశం వచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే కాబట్టి అమ్మ ఒప్పుకొంది. కానీ, నటనని కెరీర్‌గా ఎంచుకోడానికి వీల్లేదని షరతు పెట్టింది. అయితే, సినిమా విడుదలైన తర్వాత చాలా పేరొచ్చింది. అందరూ సూపర్‌స్టార్ మహేష్ బాబు, త్రిష గురించి అడిగేవాళ్లు. సెట్లో వాళ్లు ఎలా ఉండేవారో, ఏం మాట్లాడేవారో అడిగి తెలుసుకునేవాళ్లు. మా ఫ్రెండ్స్ కూడా నన్ను ‘అతడు.. అతడు..’ అని ఆటపట్టించేవాళ్లు. ‘అతడు’ తర్వాత మూడు, నాలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించా. ‘చుక్కల్లో చంద్రుడు’, ‘ఒక ఊరిలో’, ‘స్టాలిన్’ సినిమాల్లోని పాత్రలతో మంచి గుర్తింపు లభించింది.
మా నాన్న షెఫ్. అమ్మ హెడ్ మిస్ట్రెస్. చాలా స్క్రిక్ట్. బాగా చదువుకోవాలని చెప్పేది. సినిమా చాన్స్ వచ్చినప్పుడు ఓకే చెప్పినా.. తర్వాత సీరియల్స్‌లో నటిస్తానంటే అస్సలు ఒప్పుకోలేదు. అమ్మని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను. కొన్నిరోజులు మాత్రమే, ప్రొఫెషన్‌గా ఎంచుకోను అని మాటిచ్చాకే ఒప్పుకొన్నారు. ‘రాధా మధు’ సీరియల్‌తో బ్రేక్ వచ్చింది. అందులో నటిస్తూనే చదువు కంటిన్యూ చేశాను. స్టూడెంట్ లైఫ్ బాగుండేది. కాలేజీలో షూటింగ్ ముచ్చట్లు అడుగుతుండేవాళ్లు. భలేగా అనిపించేది. బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలనుకున్నా. యాక్టర్ కాకపోయి ఉంటే.. డాక్టర్ అయ్యుండేదాన్ని.
నిజానికి నటన అనేది ఒక లూప్. ఒక్కసారి మేకప్ వేసుకుని స్క్రీన్‌పై కనిపించడం అలవాటైతే అడిక్ట్ అయిపోతాం. నేనైతే యాక్టింగ్ చేయకపోతే డిప్రెషన్లోకి వెళ్లిపోయేదాన్ని. పాప పుట్టినప్పుడు కొన్నిరోజులు బ్రేక్ తీసుకున్నా. పెండ్లి తర్వాత భర్త సపోర్ట్ ఉంటేనే మహిళలు కెరీర్లో కొనసాగగలుగుతారు. ఆ విషయంలో నేను చాలా లక్కీ. ఆయన ప్రోత్సాహంతోనే యాక్టింగ్ కెరీర్ కొనసాగిస్తున్నా. అమ్మ కూడా అండగా నిలిచింది. పిల్లలను తనే చూసుకుంటుంది. నేను దేవుణ్ని చాలా నమ్ముతాను. నా ఫ్యాన్స్ దేవుళ్లతో సమానం. వాళ్ల వల్లే నేనీ స్థాయిలో ఉన్నా. అభిమానుల ఆదరణ వల్లే అవకాశాలు వస్తున్నాయి.
మా నాన్నది బోధన్. అమ్మది హైదరాబాద్. నేను పక్కా హైదరాబాదీ. ఇక్కడే పుట్టి పెరిగా. నాకు బాగా నచ్చిన వెకేషన్ స్పాట్ యాదగిరి గుట్ట. ఇంటి ఆహారం తినడానికే ఇష్టపడతాను. బయట ఫుడ్ అస్సలు తినలేను. ఆవకాయ అంటే చాలా ఇష్టం. స్పైసీ ఫుడ్ ఇష్టపడతా. ఎవరినీ నమ్మొద్దు. మన జీవితం మనది. మన మీద మనకు నమ్మకం ఉండాలి. స్నేహితులు, ప్రేమికులు, బంధువులు.. ఎవ్వరైనా కొంతవరకే. లైఫ్‌లో మీకు మీరే ఫస్ట్. తర్వాతే ఎవరైనా!