Aishwarya Sharma | ‘మా నాన్న స్టేజ్ ఆర్టిస్ట్. ఆ ప్రభావం నాపై తెలియకుండానే పడింది. అందుకే కెరీర్ పరంగా వేరే ఆప్షనేం పెట్టుకోలేదు. సెకండ్ ఇంటర్ అవ్వగానే జమ్ము నుంచి ముంబై వచ్చి యాక్టింగ్ కోర్స్‌లో చేరిపోయాను. కోర్స్ అవ్వగానే ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టా. కొన్ని యాడ్స్‌లో నటించా. హీరోయిన్గా ‘డ్రింకర్ సాయి’ నా తొలి సినిమా’ అని తెలిపింది ఐశ్వర్యశర్మ. ‘డ్రింకర్ సాయి’ సినిమా ద్వారా ఆమె కథానాయికగా పరిచయం అవుతున్నది. ధర్మ హీరోగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించింది ఐశ్వర్యశర్మ .
‘ఇది అద్భుతమైన ప్రేమకథ. ఇందులో నా పాత్ర పేరు బాగీ. మెడికల్ స్టూడెంట్‌ని. చాలా బలమైన పాత్ర. చూడ్డానికి ఇన్నోసెంట్‌గా కనిపిస్తా. కానీ రఫ్ అండ్ టఫ్‌గా ఉంటా. రెగ్యులర్ హీరోయిన్లకు భిన్నమైన పాత్ర అనమాట. ఛాలెంజ్‌గా తీసుకొని చేశా.’ అని తెలిపింది ఐశ్వర్య శర్మ. డ్రింకర్ సాయిగా ధర్మ చాలా బాగా నటించారని, సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా బావుంటుందని, అర్జున్రెడ్డికీ డ్రింకర్సాయికీ పోలిక లేదని, అర్జున్ క్లాసీ డ్రింకర్ అయితే.. సాయి మ్యాసీ డ్రింకర్ అని చెప్పింది ఐశ్వర్యశర్మ.