Actor Bobby Simha Driver | జాతీయ అవార్డు గ్రహీత, తమిళ నటుడు బాబీ సింహా కారు బీభత్సం సృష్టించింది. బాబీ సింహా డ్రైవర్ మద్యం సేవించి అతి వేగంతో కారు నడపడంతో నియంత్రణ తప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా.. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఒక మద్యం సేవించి కారు నడపడంతో పాటు అతివేగంగా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమైనందుకు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ప్రమాదం ఎక్కడుతంగల్ నుంచి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా జరిగింది. ఈ సమయంలో బాబీ సింహా కారులో లేరు.
చెన్నై ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ పుష్పరాజ్ మద్యం మత్తులో ఉండి.. కాథిపరా ఫ్లైఓవర్ నుంచి ఆలందూర్ మెట్రో స్టేషన్ వైపు వెళ్తుండగా.. అతివేగం కారణంగా కారు నియంత్రణ కోల్పోయి మూడు మోటార్‌సైకిళ్లు, రెండు ఆటోరిక్షాలు, ఒక కారును ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో మోటార్ సైకిళ్లపై ఉన్న నలుగురు గాయపడ్డారని.. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.