వెల్దుర్తి, నవంబర్ 22: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివార్లలోని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చెందిన జమున హ్యాచరీస్ పరిశ్రమ భూకబ్జాపై జరుగుతున్న సర్వేను మెదక్ కలెక్టర్ హరీశ్ సోమవారం పరిశీలించారు. సర్వేతీరు, హద్దుల ఏర్పాటు, రైతుల వాంగ్మూలాల నమోదుపై మెదక్ ఆర్డీవో సాయిరాం, తాసిల్దార్ మాలతి, సర్వే అధికారులతోపాటు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిశ్రమ వారు రోడ్డును మూసేశారని, భూముల పొజిషన్ మారిందని, తమ భూములకు హద్దులు చూపించాలని పలువురు కలెక్టర్‌కు విన్నవించారు.
రైతుల సమస్యలు పరిశీలించి, పరిష్కరించాలని తాసిల్దార్ మాలతిని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జమున హ్యాచరీస్ భూకబ్జాకు పాల్పడినట్టు రైతులు ఇచ్చిన 8 సర్వే నంబర్లలో క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి అయ్యిందన్నారు. అచ్చంపేట శివారులోని 77, 78, 79, 80, 81, 82, 130, హక్కీంపేట శివారులోని 97 సర్వే నంబర్లో సర్వే పూర్తయ్యిందని, రెండు, మూడురోజుల్లో సర్వే రి పోర్టు ఇస్తారని, తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.