అమరావతి : మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ వివేకానందా రెడ్డి (YS Viveka) ని చంపిన హంతకులకు అండగా నిలిచిన వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్ సునీత(Sunitha) కోరారు. బుధవారం హోం మంత్రి అనిత(Minister Anitha) ను ఆమె కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని, వివేకా హత్య తదనంతర పరిణామాలను వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని ఆరోపించారు . హంతకులకు అండగా నిలిచిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేలా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. సీబీఐ(CBI) అధికారులపై తప్పుడు కేసుతో పాటు సాక్షులను బెదిరించారని వాపోయారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ సీబీఐ విచారణ ఉన్నందున ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి వివరించారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వెల్లడించారు. తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.