సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా రూపొందుతోన్న యాక్షన్ ఎంటైర్టెనర్ ‘దేవకీ నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. నవంబర్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ని, టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ కథలో సోల్ చాలా డెప్త్‌గా ఉంటుందని, దర్శకుడు అర్జున్ జంధ్యాల సినిమాను అద్భుతంగా తీశారని, కథానాయిక మానస వారణాసి ఛాలెంజింగ్ రోల్ చేసిందని, కచ్చితంగా హిట్ సినిమా అవుతుందని హీరో అశోక్ గల్లా నమ్మకం వెలిబుచ్చారు. ‘మేం కొత్తవాళ్లమే అయినా మంచి అవుట్‌పుట్‌తో వస్తున్నాం. మా సినిమా రిలీజ్ టైమ్‌లోనే మట్కా, కంగువా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయినా సరే.. మా సినిమా మాదే.
కంటెంట్‌ని నమ్మి చేసిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ప్రశాంత్‌వర్మ కథ, సాయిమాధవ్ బుర్రా పదునైన సంభాషణలు, భీమ్స్ సిసిరోలియో ఆకట్టుకునే బాణీలు ఈ సినిమాకు హైలైట్ కానున్నాయి. మా హీరో అశోక్ గల్లాని హీరోగా మరోస్థాయిలో నిలబెట్టే సినిమా ఇది’ అని నిర్మాత బాలకృష్ణ చెప్పారు. కృష్ణుడి నేపథ్యంలో కథ నడుస్తుందని, కథలో చక్కని డివోషనల్ టచ్ ఉంటుందని, ఆరంభం నుంచి ముగింపు వరకూ ప్రతి పాత్రా హైలైట్ అయ్యే సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. ఇంకా కథానాయిక మానస వారణాసి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్, సమర్పణ: నల్లపనేని యామిని, నిర్మాణం: లలితాంబిక ప్రొడక్షన్స్.