AC Price | న్యూఢిల్లీ, జూన్ 19: ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తుండటంతో అంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకోవడంతో సామాన్యులు సైతం ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. ఈ వేసవి సీజన్లో ఏసీల విక్రయాలు రికార్డు స్థాయి రెండంకెల వృద్ధి నమోదైంది. అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయన్న అంచనాతో వీటి ఉత్పత్తి సంస్థలు ఇదే అదనుగా ఏకంగా ధరలను కూడా భారీగా పెంచాయి. గతంలోనే ధరలను స్వల్పంగా పెంచిన సంస్థలు జూన్ నెలలో మరోసారి 6 శాతం నుంచి 8 శాతం వరకు సవరించాయి.
ఉత్పత్తి భారీ పెంపు..
డిమాండ్ అధికంగా ఉండటంతో ఏసీల తయారీ సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచాయి కూడా. సరఫరాలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు ఉపక్రమించాయి. టాప్ కంపెనీలైన వొల్టాస్, ఎల్జీ, లాయిడ్లు ఏకంగా తమ కెపాసిటీని రెండింతలు పెంచుకున్నాయి. ఏసీల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి లాయిడ్ పేరుతో ఏసీలను విక్రయిస్తున్న హావెల్స్ రూ.30-50 కోట్ల వరకు పెట్టుబడి కూడా పెట్టింది.
ఈ ఏడాది ఏసీ ఇండస్ట్రీకి గోల్డెన్ ఈయర్. దేశవ్యాప్తంగా అత్యధిక రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో జూన్ నెలలోనూ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.
–సంజయ్ చిత్కారా, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్