సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): వచ్చే వేసవి నాటికి పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా నెట్‌వర్క్‌ను విస్తరించే పనిలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) నిమగ్నమైంది. గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న 10 సర్కిళ్ల పరిధిలోనే ప్రతియేటా ఎక్కువ విద్యుత్ వినియోగం నమోదవుతుంది. గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను విస్తృతంగా ఏర్పాటు చేసింది. ఆ కారణంగానే గత వేసవిలో రికార్డు స్థాయిలో డిమాండు పెరిగినా నెట్ వర్క్ తట్టుకొని నిలబడింది. అయినా అక్కడక్కడ అధిక లోడుతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తడంతో పలు సబ్ స్టేషన్లలో పదుల సంఖ్యలో పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా కాలనీలు, ప్రాంతాల వారీగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వేసవిలో ఉండే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవాలంటే ప్రత్యేకంగా సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని శివారు ప్రాంతాల సర్కిళ్ల అధికారులు డిస్కం ఉన్నతాధికారులకు నివేదించారు. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోనే కొత్త సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తేనే డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా అందించవచ్చని నివేదికలు ఇచ్చారు. దీంతో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సబ్ స్టేషన్లకు అవసరమైన భూముల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసింది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదని, భూములు విద్యుత్ శాఖకు అప్పగిస్తేనే సబ్ స్టేషన్ నిర్మాణం పనులు మొదలు పెడతామనే అభిప్రాయాన్ని శివారు ప్రాంత సర్కిళ్ల అధికారులు పేర్కొంటున్నారు.
కొత్తగా 35-40 సబ్ స్టేషన్లు…
విద్యుత్ ఉత్పత్తి స్టేషన్ల నుంచి డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉన్నా, క్షేత్ర స్థాయిలో సరఫరా చేసే నెట్ వర్క్‌ను యుద్ధప్రాతిపదికన విస్తరించాల్సిన అవసరం ఉంది. దక్షిణ డిస్కం అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ కోసం సుమారు రూ.450 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందులో భాగంగా సుమారు 35-40 సబ్ స్టేషన్లను కొత్తగా నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కో సబ్ స్టేషన్‌కు రూ.5 నుంచి రూ.8 కోట్ల ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనాలు సిద్ధం చేశారు. అయితే సబ్ స్టేషన్లకు అవసరమైన భూములు మాత్రం అందుబాటులో లేవు. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ భూములను కేటాయిస్తేనే పనులు మొదలు పెట్టేందుకు అవకాశం ఉంది. సైబర్ సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, హబ్సిగూడ, మేడ్చల్, సంగారెడ్డి సర్కిళ్లలోనే కొత్త సబ్ స్టేషన్లను నిర్మాణం చేయాల్సి ఉందని, ఇక్కడ ఇప్పటివరకు సబ్ స్టేషన్‌కు అవసరమైన భూములను కేటాయించకపోవడంతో పనులు చేపట్టలేకపోతున్నామని సర్కిల్ అధికారులు పేర్కొంటున్నారు. డిసెంబర్ నాటికి సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, భూములను రెవెన్యూ అధికారులు అప్పగించకపోవడంతో సబ్ స్టేషన్ల నిర్మాణం జాప్యం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.