చార్మినార్, డిసెంబర్ 17 : చిన్న చిన్న నిర్లక్ష్యాలు కొన్నిసార్లు అత్యంత విషాదాన్ని నింపుతాయి. పాతనగరంలో అలాంటి ఓ దుర్ఘటనతో యావత్ కుటుంబమంతా శోక సంద్రంలో మునిగిపోయింది. రెండేండ్లు కూడా నిండని ఓ ముద్దులొలికే చిన్నారి రెండో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందాడు. కామాటిపుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉస్మాన్‌బాగ్ ప్రాంతానికి చెందిన సల్మాన్ చిన్న కుమారుడు అమ్ధాం (2) శుక్రవారం ఉదయం ఇంట్లో అల్లరి చేస్తూ అందరినీ ఆటపట్టిస్తున్నాడు. రెండో అంతస్థులో ఆడుకుంటూ వెళ్లి గది బయటికి వచ్చి రెయిలింగ్‌ను పట్టుకొని నిలబడే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఎవరూ దీన్ని గమనించకపోవడంతో అమ్ధాం పట్టు తప్పి రెండంతస్థుల భవనం నుంచి కిందపడ్డాడు. దీంతో చిన్నారి తలకు బలమైన గాయమైంది. వెంటనే సల్మాన్ ఆ చిన్నారిని శాలిబండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే అప్పటికే అమ్ధాం మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.