మరికల్, జనవరి 19: తాను నిరుపేదనని, తన భర్త పేరిట ఉన్న భూమిని విరాసత్ చేయాలని కాళ్లావేళ్లా పడ్డా ఆ తాసిల్దార్ కనికరించలేదు. రూ.40 వేలు డిమాండ్ చేసిన ఆయన చివరకు రూ.20 వేలకు ఒప్పుకొన్నాడు. తప్పనిసరి పరిస్థితిలో ఆమె ఏసీబీ అధికారులకు పట్టించింది. నారాయణపేట జిల్లా మరికల్లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా..
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం లాల్‌కోటకు చెందిన రాచాల సతీష్ అలియాస్ సత్యనారాయణకు నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్ద చింతకుంట శివారులో 1.7 ఎకరాల భూమి ఉన్నది. సతీష్ గతేడాది ఏప్రిల్‌లో మరణించారు. సదరు భూమిని తన పేరిట విరాసత్ చేయాలని సతీష్ భార్య రాచాల శ్రీశైల మరికల్ తాసిల్దార్ శ్రీధర్‌ను కోరగా.. రూ.40 వేలు లంచం డిమాండ్ చేశాడు. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, భర్త లేకపోవడంతో బతుకు దెరువు కోసం హైదరాబాద్‌లో ఇండ్లల్లో పనిచేస్తూ బతుకుతున్నానని చెప్పారు.
అంత మొత్తం ఇచ్చుకోలేనని ప్రాథేయపడగా రూ.20 వేలకు తగ్గాడు. ఆమె ఈ విషయాన్ని తన ఇంటి సమీపంలోని రుక్మొద్దీన్ అనే వ్యక్తి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించారు. బుధవారం శ్రీశైల నుంచి తాసిల్దార్ శ్రీధర్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. నగదును స్వాధీనం చేసుకొని, తాసిల్దార్‌ను అదుపులోకి తీసుకొన్నారు. విచారణ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణాగౌడ్ తెలిపారు. అలాగే హైదరాబాద్ చైతన్యపురి కాలనీలోని శ్రీధర్ నివాసంలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.