ఎండలు మండిపోతున్నాయి. ఏటికేడు వేసవి ఉష్ణోగ్రతలూ పెరిగిపోతున్నాయి. దాంతో, ఫ్యాన్లూ కూలర్లు పక్కన పడేసి.. ఎయిర్ కండిషనర్లు కొనాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఒకప్పుడు ఉన్నత వర్గాలకే పరిమితమైన ఏసీలు.. ఇప్పుడు మధ్యతరగతి ఇళ్లలోనూ కొలువుదీరుతున్నాయి. అయితే, ఏసీలను ఎక్కువశాతం మంది ఏడాదిలో మూడునాలుగు నెలలు మాత్రమే వినియోగిస్తుంటారు. వేసవి ముగియగానే.. వాటిని ఆన్ చేయడమే మర్చిపోతారు. మళ్లీ మార్చి నుంచే.. ఏసీల వాడకం మొదలుపెడతారు. ఏసీని మళ్లీ వాడాలంటే.. మొదటగా దాన్ని క్లీన్ చేయాలి. నిజానికి ఆయా సంస్థల టెక్నీషియన్లతోనే ఏసీలను సర్వీసింగ్ చేయించుకుంటే మంచిది.
అదనపు ఖర్చు ఎందుకని, మీరే క్లీన్ చేసుకోవాలని అనుకుంటే.. కొన్ని విషయాలను మాత్రం తప్పకుండా ఫాలో కావాలి. విండో ఏసీ, స్లిట్ ఏసీ.. రెండిటిలోనూ ‘ఫిల్టర్’ అత్యంత ముఖ్యమైనది. వీటితోనే ఏసీ బాగా పనిచేస్తుంది. మంచి కూలింగ్ రావాలంటే.. ఫిల్టర్ బాగుండాల్సిందే! అయితే, ఏసీ ఫిల్టర్లను శుభ్రం చేసేటప్పుడు కొందరు చిన్నచిన్న తప్పులు చేస్తుంటారు. దాంతో ఫిల్టర్లు దెబ్బతిని, పాడైపోతాయి. వాటిని బాగు చేయించాలంటే.. చాలా ఖర్చు కూడా! కాబట్టి, ఏసీ దెబ్బతినకుండా ఉండాలంటే తగిన సూచనలు పాటించాలి.
ఏసీ ఫిల్టర్లను ప్రతి రెండు వారాలకు ఒకసారి శుభ్రం చేస్తుండాలి. ఇందుకోసం వాక్యూమ్ క్లీనర్‌ను వాడటం మంచిది. దీనికి సున్నితంగా ఉండే బ్రష్‌ను అటాచ్ చేసుకొని, ఫిల్టర్‌ను క్లీన్ చేసుకుంటే ఇట్టే శుభ్రమవుతాయి.
గోరువెచ్చని నీటిలో తేలికపాటి డిటర్జెంట్ లేదా డిష్ సోప్ కలిపి ఫిల్టర్‌ను శుభ్రం చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగి.. గాలికి ఆరనివ్వాలి.
ఒక స్ప్రే బాటిల్లో వేడినీళ్లు, లిక్విడ్ సోప్ కలిపి.. ఏసీ కాయిల్స్‌ను శుభ్రం చేయడానికి వాడుకోవాలి. దీంతో కాయిల్స్ పూర్తిగా శుభ్రమవుతాయి.
ఏసీ నెట్‌పై పేరుకుపోయే దుమ్మూధూళిని తొలగించడంలో బ్లోయర్ లేదా వాక్యూమ్ క్లీనర్ సమర్థంగా పనిచేస్తుంది.
ఏసీలను శుభ్రం చేయడానికి వాషింగ్ డిటర్జెంట్‌ను ఉపయోగించకూడదు. ఇది ఏసీ ఫిల్టర్‌ను దెబ్బతీస్తుంది.
ఏసీ ఫిల్టర్ చాలా సన్నగా, సున్నితంగా ఉంటుంది. గట్టిగా ఉండే బ్రష్‌తో వీటిని శుభ్రం చేయాలని ప్రయత్నిస్తే.. అవి పాడయ్యే ప్రమాదం ఉంటుంది. బట్టలు ఉతికే బ్రష్ కూడా.. ఏసీ ఫిల్టర్‌కు హాని కలిగిస్తుంది.
ఎక్కువ దారాలు ఉండే వస్ర్తాన్ని ఉపయోగించినా.. ఏసీ ఫిల్టర్ దెబ్బతింటుంది.
ఫిల్టర్‌ను శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది గోడకైనా, నేలకైనా తగిలితే.. ఏసీ ఫిల్టర్ పాడవుతుంది.