Jadavpur University : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో జరిగింది. బుధవారం యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ యూనియన్ (ఎఫ్‌ఈటీఎస్‌యూ) సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థులకు, వామపక్ష విద్యార్థులకు మధ్య వాగ్వాదం తలెత్తి, అది ఘర్షణకు దారితీసింది. డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (డీఎస్ఎఫ్), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)తోపాటు సీపీఎం విద్యార్థి సంఘాలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. అయితే, మీటింగ్ బయట కొందరు రాళ్లు, ఇటుకలు పట్టుకొని వచ్చినట్లు వారు ఆరోపిస్తున్నారు. వాళ్లు వచ్చి తమపై దాడి చేశారని, ఈ ఘటనలో తమ వారు చాలా మంది గాయపడ్డారని వామపక్ష విద్యార్థులు చెబుతున్నారు.
కొందరు ఏబీవీపీ విద్యార్థులు కూడా గాయపడ్డట్లు సమాచారం. ముఖ్యంగా అరబిందో భవన్ క్యాంపస్ పరిధిలో ఏబీవీపీ నేతలు నిప్పుపెట్టారని వామపక్ష విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బయట నిప్పు పెట్టడంతో రాత్రంతా విద్యార్థులు క్యాంపస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆత్మ రక్షణ కోసం క్యాంపస్ గేట్లు మూసివేయాల్సి వచ్చిందన్నారు. ఎస్ఎఫ్ఐ, డీఎస్ఎఫ్ జెండాల్ని ఏబీవీపీ నేతలు తగులబెట్టారని ఆరోపించారు. ఏబీవీపీ-బీజేపీ-ఆర్ఎస్ఎస్ గూండాలు క్యాంపస్‌లో అర్ధరాత్రి హింసకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల్ని ఏబీవీపీ నేతలు ఖండించారు.
ఈ హింసకు వామపక్ష విద్యార్థులే కారణమని విమర్శించారు. ఈ నేపథ్యంలో గురువారం క్యాంపస్‌లో ఆందోళన చేస్తామని ఏబీవీపీ ప్రకటించింది. అయితే, ఈ ఘర్షణలపై ఇప్పటివరకు యూనివర్సిటీ అధికారులు స్పందించలేదు. ఎలాంటి ప్రకటనా చేయలేదు.