న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్(Sajjan Kumar) కన్నుమూశారు. 1984 నాటి సిక్కు అల్లర్ల కేసులో ఆయన జీవితకాల శిక్షను అనుభవిస్తున్నారు. ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆస్పత్రిలో ఆయన ప్రాణం విడిచారు. తీహార్ జైలు నుంచి ఆయన్ను చివరి క్షణాల్లో ఆస్పత్రికి తరలించారు. ఆయన వయసు 80 ఏళ్లు. చాన్నాళ్లుగా పలు రకాల రుగ్మతలతో ఆయన బాధపడుతున్నారు. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చింది. ఆ తర్వాత ఆయనకు ఆ కేసులో జీవితకాల శిక్షను విధించింది. సజ్జన్ కుమార్‌కు మరణశిక్ష విధించాలని కోరుతూ సిక్కు అల్లర్ల బాధితులు డిమాండ్ చేశారు.
మూడు సార్లు ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఔటర్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నేతగా గుర్తింపు ఉన్నది. 2018లో దోషిగా తేలడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత ఢిల్లీలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. 1984 అక్టోబర్ 31వ తేదీన ఇందిరా గాంధీ బాడీగార్డులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఆమె హత్యకు పాల్పడ్డారు. అయితే ఆ హత్య నేపథ్యంలో సిక్కులపై ఢిల్లీలో ఊచకోత జరిగింది. సిక్కుల ఇండ్లు, షాపులపై దాడి చేశారు. సుమారు 3వేల మంది సిక్కులను హతమార్చారు.
జశ్వంత్ సింగ్‌తో పాటు ఆయన కుమారుడి హత్య కేసులో సజ్జన్ కుమార్ నిందితుడిగా ఉన్నారు. ఇందిరా గాంధీ మరణం తర్వాత ఇద్దరు సిక్కులను హతమార్చిన కేసులో మరో వ్యక్తి యశ్పాల్ మాలిక్‌కు మరణశిక్ష వేశారు. ఇక ఇదే ఘటనతో లింకున్న కిషోరి లాల్ అనే వ్యక్తికి కూడా 1996లోనే మరణశిక్ష విధించారు. కానీ సిక్కుల మర్డర్ కేసులో సజ్జన్ కుమార్‌కు కేవలం జీవితకాల శిక్ష పడింది. కాంగ్రెస్ పార్టీ సజ్జన్ కుమార్‌ను రక్షించిందని అకాళీదళ్ పార్టీ ఆరోపించింది. సిక్కుల హత్య కేసుల్లో ఆయన పాత్ర ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనకు అండగా నిలిచిందని అకాలీదళ్ ఆరోపించింది. 2004 వరకు ఆయన కాంగ్రెస్ ఎంపీగా కొనసాగారు. 2009 జనరల్ ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఆయన సోదరుడు రమేశ్ కుమార్‌ను నిలబెట్టారు. 2009లో రమేశ్ కుమార్ ఎన్నికయ్యారు. కానీ 2014 సాధారణ ఎన్ని్లో ఓడిపోయారు.