Aamir Khan | బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ ఓటీటీ వేదికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓటీటీల వలన ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేసారని తెలిపారు. ఇది సినిమా వ్యాపారానికి ఏ మాత్రం మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు. ‘వేవ్స్’ కార్యక్రమంలో ‘ఇండియన్ సినిమా, ఓరియంటల్ లుక్’ అనే అంశంపై ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ ఓటీటీపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. “ఇప్పుడు థియేటర్లలో విడుదలైన సినిమాలు చాలా తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు థియేటర్లలో విడుదలైన సినిమా టీవీలో ప్రసారం కావడానికి దాదాపు ఏడు నుండి ఎనిమిది నెలల సమయం పట్టేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకవేళ నేను ఒక వస్తువును మీకు అమ్ముతున్నానని అనుకుందాం. ‘దయచేసి ఈ వస్తువును కొనండి, లేదంటే ఎనిమిది వారాల తర్వాత నేనే మీ ఇంటికి తెచ్చి ఇస్తాను’ అని చెబితే మీరు దేన్ని ఎంచుకుంటారు? ఓటీటీ విషయంలోనూ ఇదే జరుగుతోంది. అందుకే థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మనం పరోక్షంగా ప్రేక్షకులను థియేటర్లకు రావద్దని చెబుతున్నాము. దీని వల్లే చాలా సినిమాలు విజయం సాధించలేకపోతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో సినిమా స్క్రీన్ల సంఖ్యపై కూడా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. “మన దేశంలో దాదాపు 10 వేల స్క్రీన్లు మాత్రమే ఉన్నాయి. అదే అమెరికాలో 40 వేలకు పైగా స్క్రీన్లు ఉండగా, చైనాలో సుమారు 90 వేల స్క్రీన్లు ఉన్నాయి. మనకున్న 10 వేల స్క్రీన్లలో సగం దక్షిణ భారతదేశానికి చెందినవి. అంటే హిందీ సినిమాలకు గరిష్టంగా 5 వేల స్క్రీన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మన దేశ జనాభాలో కేవలం రెండు శాతం మంది మాత్రమే ఒక పెద్ద హిందీ సినిమాను థియేటర్లలో చూసే అవకాశం ఉంది. కాబట్టి మన దేశంలో థియేటర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆమిర్ వెల్లడించారు.