కుభీర్, సెప్టెంబర్ 3 : ఓటరు ఐడీకి ఆధార్ అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్ బత్తుల విశ్వంభర్ సూచించారు. మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్వోల పని తీరును, ఆధార్ అనుసంధాన ప్రక్రియను శనివారం పరిశీలించారు. ఓటర్ల నమోదు, మృతి చెందిన ఓటర్ల తొలగింపు తదితర అంశాలను బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 20 వరకు 100 శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఇప్పటి వరకు 24 శాతం ఓటరు ఐడీకి ఆధార్ అనుసంధానం పూర్తయిందన్నారు. మండలంలో మొత్తం 36,660 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. 52 పోలింగ్ కేంద్రా లు, 52 మంది బీఎల్వోలు ఉన్నట్లు వివరించారు. ఈ ప్రక్రియను ఐదుగురు సూపర్వైజర్లతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటర్ నమోదుకు గాను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆర్ఐ వెంకటరమణ, బీఎల్వోలు ఉన్నారు.