హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): పుట్టిన వెంటనే నవజాతా శిశువులకు ఆధార్ కార్డులు జారీచేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ప్రజలందరికీ ఆధార్‌కార్డుల జారీ, మొబైల్ నంబర్ల అనుసంధానం పై గురువారం బీఆర్కే భవన్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏటా ఆరు లక్షల మంది జన్మిస్తున్నారని, వారందరికీ వెంటనే ఆధార్ కార్డులు జారీచేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 0-5 ఏండ్లలోపు చిన్నారులకు ఆధార్‌కార్డుల జారీకి చర్య లు చేపట్టాలని సూచించారు. ఆధార్ సీడింగ్ కేంద్రా లు లేని మండలాల్లో వెంటనే ఏర్పాటుచేయాలని ఐటీశాఖ కార్యదర్శిని ఆదేశించారు.
అందరికీ ఆధార్ కార్డులు ఇవ్వడంతోపాటు వ్యక్తిగత మొబైల్ నంబర్లను అనుసంధానం చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, పంచాయితీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తాని యా, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అడిషనల్ సీఈవో బుద్దప్రకాష్, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, యూడీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంగీత పాల్గొన్నారు.