SSRajamouli | మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’. రూ.1300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను పూర్తిస్థాయి IMAX (ఐమాక్స్) ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. భారతీయ సినిమా చరిత్రలో ఒక చిత్రాన్ని పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేయడం ఇదే తొలిసారి కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడించారు జక్కన్న.
రాజమౌళి మాట్లాడుతూ.. ‘వారణాసి’ కథా నేపథ్యం అత్యంత భారీ స్కేల్లో ఉంటుంది. అంటార్కిటికాలోని గడ్డకట్టే మంచు కొండల మధ్య జరిగే సాహసాలు, అలాగే రామాయణ కాలానికి సంబంధించిన అత్యంత వైవిధ్యమైన, అద్భుతమైన విజువల్స్‌ను వెండితెరపై ఆవిష్కరించడానికి సాధారణ కెమెరాలు సరిపోవు. ఈ కథలోని గ్రాండియర్‌ను, ఆ లోతైన ఎమోషన్స్‌ను ప్రేక్షకులు థియేటర్లలో కూర్చుని స్వయంగా అనుభవించాలంటే ఐమాక్స్ స్క్రీన్ మాత్రమే సరైన వేదికని నా నమ్మకం.
సాధారణంగా వైడ్ స్క్రీన్ సినిమాల కంటే ఐమాక్స్ ఫార్మాట్ 26% ఎక్కువ విజువల్ ఏరియాను కవర్ చేస్తుంది. దీనివల్ల ప్రతి ఫ్రేమ్ అత్యంత స్పష్టంగా, భారీగా కనిపిస్తుంది. మహేష్ బాబును అడ్వెంచర్ హీరోగా ఇంతటి భారీ ఫార్మాట్లో చూడటం అభిమానులకు కనువిందు చేయడమే కాకుండా, భారతీయ సినిమా సాంకేతిక ప్రమాణాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్తుందని జక్కన్న ధీమా వ్యక్తం చేశారు.