ముంబై, జూన్ 18: ప్రేమించిన యువతి.. తనను దూరం పెట్టిందన్న కక్షతో ఓ యువకుడు ఆమెపై అత్యంత పాశవికంగా దాడికి తెగబడ్డాడు. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న యువతిని వెంటాడి దారుణంగా హత్య చేశాడు. పరిశ్రమల్లో వాడే స్పానర్తో ఆమె తలపై 18 మార్లు కొట్టడంతో.. యువతి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. మహారాష్ట్ర కొంకణ్ తీరంలోని వాసా నగరం చిన్చ్పాడా ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతురాలు ఆర్తి యాదవ్(22), దాడికి తెగబడ్డ రోహిత్ యాదవ్(32) గతంలో ఇద్దరూ ప్రేమించుకున్నారని, కొద్దికాలంగా ఆ యువతి మరొక వ్యక్తికి దగ్గరవ్వటంతో రోహిత్ యాదవ్ ఈ దాడికి తెగబడినట్టుగా స్థానిక పోలీసులు చెబుతున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి.. హత్య కేసు నమోదుచేశామని తెలిపారు. దాడి ఘటనను అడ్డుకోకుండా, కొంతమంది స్మార్ట్ఫోన్లలో వీడియో తీయటం.. దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటాన్ని పోలీసులు తప్పుబట్టారు. యువతి తలపై స్పానర్తో బాదుతున్నా, రోడ్డుపై అందరూ చూస్తుండిపోవటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది.