NIZAMABAD | వినాయక నగర్,ఏప్రిల్ 02: వైన్ షాపులో మద్యం విక్రయిస్తున్న వ్యక్తులకు కత్తి చూపించి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ, బి రఘుపతి తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని బోధన్ బస్టాండ్ ఏరియాలో గల ఓ వైన్ షాప్ వద్దకు ఓ యువకుడు మార్చి 31 వచ్చాడు. షాపులో మద్యం విక్రయిస్తున్న సతీష్, నాగరాజు ఇరువురికి కత్తి చూపించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా అదే కత్తితో వైన్ షాప్ వద్ద ఉన్న ఇతర వ్యక్తులను సైతం భయభ్రాంతులకు గురి చేసే నానా హంగామా సృష్టించాడు. ఈ ఘటన పై విశ్వక్ కాంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ హెచ్ వో తెలిపారు.
సీసీ కెమెరాల ఆధారంగా కత్తితో భయభ్రాంతులకు గురిచేసిన నగరంలోని అహ్మద్ పుర కాలనీకి చెందిన పాత నిందితుడైన షేక్ అల్తాఫ్ ను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్ హెచ్ ఓ పేర్కొన్నారు. కాగా సదరు నిందితుడిపై మహారాష్ట్రలోని ముద్కేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హత్య కేసులో జైలుకెళ్లి విడుదలైనా తన పద్ధతి మార్చుకోకపోవడం వల్ల అతడిని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.