1990 తర్వాత ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రాంతీయ వివక్షకు లోనుకావడానికి సంబంధించిన ప్రశ్నలను వివిధ వర్గాలవారు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ ఆకాంక్షలు బలపడి ప్రాంతీయ స్పృహ ప్రాంతీయ చైతన్యంగా రూపుదిద్దుకున్నది. ఈ క్రమంలోనే ప్రాంతీయ సాహిత్యం మరింత నిర్దిష్టతను సంతరించుకున్నది. ఆచార్య కాత్యాయనీ విద్మహే ప్రాంతీయ సాహిత్యాధ్యయన ఆవశ్యకతను వివరిస్తూ, ‘ప్రాంతీయత సాహిత్యానికి గుణమేకాని విరోధం కాదు. సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రాంతీయత ప్రాతిపదికగా అధ్యయనం తప్పనిసరి’ అంటారు.
ప్రాంతీయవాదంలో తమను ఇతర ప్రాంతాలవారు అణచివేస్తున్నారన్న ఆగ్రహం అడుగడుగునా కన్పిస్తుంది. తమ ప్రాంత సంస్కృతీ, సాంప్రదాయాలపై ఆత్మగౌరవంతో కూడిన అభిమానం ఉంటుంది. పాలకులు, వలసవాదులు చూపిస్తున్న వివక్షపై నిరసన ఉంటుంది. ఆ నిరసన సాహిత్యం ద్వారా ప్రకటింప బడుతుంది.
ప్రాంతీయవాద సాహిత్యంలో ఆ ప్రాంతపు చారిత్రక వారసత్వం, సాంస్కృతిక విలువలు, వైఖరులు, దృక్పథాలు వ్యక్తం చేయడానికి సాహిత్యంలో మాండలిక భాష ఉపయోగించబడుతుంది. ప్రాంతీయ ఆధిపత్యాన్ని ప్రకటించుకోడానికి మాండలిక రచన చేస్తున్నారని కూడ గుర్తించవచ్చు. కరువు, వలసలు, విద్య, నిరుద్యోగం, అసమానతలు, పేదరికం వల్ల రైతుల ఆత్మహత్యలు, కార్మికుల ఆకలిచావులు మొదలైన సామాజిక సమస్యలు ఆ ప్రాంత సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి. ప్రాంతీయవాద సాహి త్యం వస్తువులో, శిల్పం, భాష, ఉపమానాల్లో, పదచిత్రా ల్లో, వ్యక్తీకరణ, రూపంలో ప్రత్యేకతను కలిగి ఉంటుంది.
ప్రాంతీయవాద సాహిత్యం – తెలంగాణ
తెలంగాణ ప్రాంతీయవాదం ఇతర ప్రాంతాల్లో కన్నా బలంగా పుంజుకున్నది. దానికి కొన్ని ప్రత్యేక చారిత్రక, సామాజిక, రాజకీయ కారణాలు పనిచేశాయి. మిగిలిన తెలుగు ప్రాంతాల కన్నా తెలంగాణ ఎలా భిన్నమైనదో అవగతమైతేకానీ, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం అర్థంకాదు. ప్రముఖ సాహిత్య విమర్శకుడు బాలశ్రీనివాసమూర్తి తెలంగాణ చరిత్రను మూడు దశలుగా విభజించారు. శాతవాహనుల నుండి కుతుబ్ షాహీల దాకా సాగింది మొదటి దశ. కుతుబ్ షాహీల నుండి నిజామ్ చివరి నవాబుదాకా రెండవదశ. ఈ దశలోనే కోస్తాంధ్ర – తెలంగాణల మధ్య పలురకాలైన భిన్నత్వాలు పరిణమించాయి. నిజాం అనంతరకాలం నుండి ఈనాటి దాకా కొనసాగుతున్నదీ, అస్తిత్వాన్ని కాపాడుకునేది మూడవ దశ. ఈ మూడు దశలు తెలంగాణకే ప్రత్యేకం.
డా.పసునూరి రవీందర్ తెలంగాణ ప్రత్యేకత గురించి మరింత వివరిస్తూ ‘తెలంగాణ నిత్య ఉద్యమక్షేత్రం. ఆయా ఉద్యమాల ప్రభావం ఇక్కడి సాహిత్యం మీద స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే పదునైన ఉద్యమ సాహిత్యం ఈ ప్రాంతం నుంచి విస్తారంగా వెలువడింది’ అం టారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణ వివక్షకు లోనయింది. భాషా, సంస్కృతులు సైతం అపహాస్యానికి లోనయ్యా యి. మొత్తంగా తెలంగాణ సామాజిక, సాంస్కృతిక జీవితం విచ్ఛిన్నమైంది. తమ భాష, సంస్కృతి, సంపదల మీద జరిగే వివక్షకు స్పందించి, కవులు, రచయితలు పాటలు, కవితలు, కథలు, నవలలు, విమర్శలు రాశారు. 1969లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం 1996 నుంచి నెమ్మది నెమ్మదిగా పుంజుకుని ప్రాంతీయవాద ప్రభావాన్ని ద్విగుణీకృతం చేసింది.
తెలంగాణ ప్రాంతీయవాద కవిత్వం
తెలంగాణ ప్రాంతీయవాదానికి మొదటిగా స్పందించినది తెలంగాణ కవిత్వం. 1996లో జూలూరు గౌరిశంకర్ ‘నా తెలంగాణ’ అనే దీర్ఘ కవితతో ప్రాంతీయవాదా న్ని, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు. 2002లో ఆయన 129 మంది తెలంగాణ కవులతో ‘పొక్కిలి’ అనే మరో కవితా సంకలనం తెచ్చారు. ఇందులోని కవులందరూ తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, అంబటి సురేంద్రరాజుల సంపాదకత్వంలో ‘మత్తడి’ కవితా సంకలనం వచ్చింది. తెలంగాణ నూరేండ్ల కవితా వైభవానికీ, వైవిధ్యానికి నిలువెత్తు దర్పణం ఇది. సిద్ధార్థ, సీతారాం, నందిని సిధారెడ్డి, దర్భశయనం శ్రీనివాసాచార్య, ఉదారి నారాయణ, రత్నాకర్ రెడ్డి, వఝల శివకుమార్, కృష్ణమూర్తి యాదవ్, జూకంటి జగన్నాథం మొదలయినవారు కూడా ప్రాంతీయ వాద కవిత్వం రాశారు. ముదిగంటి సుజాతారెడ్డి తెలంగాణ కవిత్వాన్ని విశ్లేషిస్తూ, ‘ఆధునిక కాలంలో తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో కవితలు, కథలు ప్రచురింపబడినాయంటే అతిశయోక్తికాదు. ఈ కవితల్లో భావాల్లో కొత్తదనం, వస్తువులో కొత్తదనం, ఉపమానాల్లో, భావచిత్రాల్లో కొత్తదనం కన్పిస్తుంది. అరిగిపోయిన భావ వ్యక్తీకరణలు లేవు. కవుల హృదయాల్లోంచి వచ్చిన ఆవేశమే కవితలుగా మారాయి’ అంటారు.
తెలంగాణ నుంచి పదికి పైగా దీర్ఘకవితలు కూడా వచ్చా యి. గేయ పద్ధతిలో మొదటి నుంచి చివరి వరకు ఒక వస్తువును తీసుకుని రాయడం దీర్ఘ కవిత లక్షణం. ఎన్. గోపి ‘జలగీతం’, అఫ్సర్ ‘తెలంగాణ’, దర్భశయనం శ్రీనివాసాచార్య ‘ఆట’, అనిశెట్టి రజిత ‘లచ్చవ్వ’, అల్లం నారాయణ ‘ఒక మనాది’, వెంకట్ ‘వర్జీ’ మొదలైన దీర్ఘ కవితలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకాలంలో వచ్చాయి. వీటిల్లో ప్రాంతీయ స్పృహ, అస్తిత్వ పోరాటాల నేపథ్యం కన్పిస్తుంది.
(ఇంకా ఉంది)
-శాంతిశ్రీ బెనర్జీ
98719 89360