బలమైన నాయకత్వం ఉన్న ఏ అంకుర సంస్థ కూడా వైఫల్యాల బాట పట్టదు సరికదా తనకు ఎదురైన సవాళ్లు అధిగమించి వాటిని సరికొత్త అవకాశాలుగా మార్చుకుంటుంది. దూరదృష్టి, అవకాశాలను అందిపుచ్చుకోగల సామర్థ్యం, వినియోగదారులకు అనుకూలంగా ఉండే విధానాలు, వ్యాపార నిర్వహణకు అవసరమైన ఆర్థిక నైపుణ్యం ఏ సంస్థ విజయానికైనా కీలకం. అదే సమయంలో ఖర్చును అదుపు చేసుకుంటూనే ఎదగడానికి అనుకూలమయ్యే విధానాలు (స్కేలబుల్ బిజినెస్ మోడల్), మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అదనపు ప్రయోజనాన్ని అందిస్తాయి.
స్టార్టప్‌లు విఫలం కావటానికి కొన్ని అంతరంగ సమస్యలతో పాటు బయట అంశాలు కూడా కారణమవుతాయి. మార్కెట్‌ను అధ్యయనం చేయటంలో, వినియోగదారులను అర్థం చేసుకోకపోవటంలో వైఫల్యాలు, బిజినెస్ వ్యవహారాల్లో సాంకేతిక సామర్థ్యం కొరవడటం లాంటివి స్టార్టప్‌లు విఫలం కావటానికి ప్రధాన కారణాలని సీబీ ఇన్ సైట్స్, విల్ బర్ట్ ల్యాబ్స్ అధ్యయనంలో వెల్లడైంది. వాటితో పాటు ఫైనాన్సియల్ మేనేజ్మెంట్, ఫండింగ్ ఇష్యూలు ఎలాగూ ఉండనే ఉంటాయి.
2026 ప్రారంభం నాటికి దాదాపు 128 స్టార్టప్‌లు యూనికార్న్ హోదాను పొందాయి. ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, ఈ కామర్స్, డీప్‌టెక్ రంగాలు ఇందులో ప్రధానమైనవి. స్టార్టప్‌లు దాదాపు 21.9 లక్షల ఉద్యోగాలను సృష్టించాయి. అంకుర సంస్థల్లో కెరీర్ వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉండటంతో చాలామంది స్టార్టప్‌లలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. అక్కడ భిన్నమైన అంశాలను నేర్చుకోగలిగే వాతావరణం ఉండటంతో పాటు త్వరగా గుర్తింపు లభించడం కూడా ఉద్యోగస్తులను స్టార్టప్స్ ఆకర్షిస్తున్నాయి. తమను తాము నిరూపించుకోవాలి, త్వరత్వరగా ఎదగాలి అనే దృక్పథంతో ఉండే స్టార్టప్ యాజమాన్యాలు కూడా సమర్థులైన వ్యక్తులను ఎంపిక చేసుకుని ఎక్కువ జీతం ఇచ్చి పని చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, ఇప్పటికీ నిపుణుల కొరత ఈ రంగాన్ని వేధిస్తున్నది. 55 శాతం స్టార్టప్‌లు సామర్థ్యం ఉన్న వృత్తి నిపుణులు లేక సతమతమవుతున్నాయని అంచనా! మరోవైపు పెట్టుబడిదారులు దీర్ఘకాలిక వృద్ధి గురించి కాకుండా లాభాల గురించి చూడటంతో 2024 చివరి నాటి నుంచి సీడ్ ఫండింగ్ బాగా తగ్గుముఖం పట్టింది. మరో వైపు చిన్న నగరాల్లో మౌలిక సదుపాయాల ధరలు పెరగటంతో నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయి.
ప్రభుత్వం కూడా ఆర్థిక అభివృద్ధి, మహిళల స్వావలంబన కోసం అంకుర సంస్థలు కీలకం అని గుర్తించింది. 2030 నాటికి మహిళా ఆధారిత స్టార్టప్‌లు 14 నుంచి 25 శాతానికి పెరగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గుర్తింపు పొందిన స్టార్టప్‌లలో 43 శాతం అంటే 73 వేల వరకూ స్టార్టప్‌లను మహిళలే నిర్వహిస్తుండటం గర్వకారణమే. 2016లో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా సంస్థ ఈ రంగం వృద్ధికి ఇతోధికంగా చర్యలు తీసుకుంటున్నది. పెట్టుబడి అధికంగా అవసరమైన ఈవీలు, రొబోటిక్ వంటి రంగాలపైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అవకాశాలను వృత్తి నిపుణులు అందిపుచ్చుకుంటే మరిన్ని స్టార్టప్‌లు వెలుగు చూస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు.