ఓ పాతికేళ్ల క్రితం పరిస్థితి! ఇంట్లోకి ఫోన్ కావాలంటే ముందు ఓ అర్జీ పెట్టుకోవాల్సి వచ్చేది. దాని మీద ఉన్న క్రమ సంఖ్య ప్రకారం మూడు నెలలకో, ఆరు నెలలకో… ఒక్కోసారి ఏడాదికో ఫోన్ కనెక్షన్ వచ్చేది. మీ ఇంటి వరకు లైన్ లేదనో, పరికరాలు ఇంకా రాలేదనో, వర్షాకాలం తర్వాత పని మొదలుపెడతామనో… ఇలా ఆలస్యానికి రకరకాలుగా కారణాలు వినిపించేవి. చాలామంది ఆ బాధలు భరించలేక ఎస్టీడీ బూత్‌లను ఆశ్రయించేవారు.
అక్కడ మరో సమస్య. రాత్రివేళల్లో చార్జీలు తక్కువ ఉంటాయని లైన్లో నిలబడి, పదిమంది అపరిచితుల ముందు పర్సనల్ విషయాలు చెప్పుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అదే పని గంట, రెండు గంటల్లో పూర్తయిపోతున్నది. టీవీల సంగతీ ఇంతే! నచ్చిన సినిమా దేవుడెరుగు. అసలు తెలుగు సినిమా, తెలుగు పాట వినడానికే ఎన్నో ప్రహసనాలు దాటాల్సి వచ్చేది.
మరి ఇప్పుడో! నట్టిల్లే మల్టీప్లెక్స్‌గా మారిపోయింది. మన జీవనస్థాయి మెరుగుపడటం, సాంకేతికత పెరగడం, అవగాహన లాంటి విషయాలన్నీ ఇందుకు కారణం కావచ్చు. తమ సేవలను అలవాటు చేసేందుకు కొన్ని సంస్థలు చేసే మాయ ఉండవచ్చు. ఈ పరిణామానికి ప్రధాన కారణం పోటీతత్వమే! ఒకరి కీడును మరొకరు కోరుకునే పోటీతో అంతా నాశనం అవుతుంది. కానీ, ఒకరిని మించి మరొకరు ఎదగాలనుకునే ఆరోగ్యకరమైన పోటీ అందరికీ మేలుచేస్తుంది. సమాజాన్నీ ముందుకు నడిపిస్తుంది. అందుకే అన్నారుగా పెద్దలు… ‘స్పర్ధయా వర్ధతే విద్య’ అని. అది ఏ రంగానికైనా అన్వయం అవుతుంది.
– కె.సహస్ర
మనిషి చంద్రుణ్ని కూడా జయించాడు! ఈ మాటను మనం ఎన్నిసార్లో విని ఉంటాం కదా! మన మేధస్సుకు, నాగరికతకు పరాకాష్ఠగా దాన్ని భావిస్తూ ఉంటాం. కానీ, దాని వెనకాల ఓ ఆశ్చర్యకరమైన పోటీ ఉంది. ఆ మాటకు వస్తే… అంతరిక్ష రంగంలో ఈ రోజు సాధించిన అభివృద్ధికి మూలకారణం పోటీనే! అదే స్పేస్ రేస్. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచం మీద ఆధిపత్యం కోసం అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైన విషయం తెలిసిందే! 1951లో అమెరికా ఎప్పుడైతే ఓ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాలనే ప్రణాళిక ప్రకటించిందో, నెల తిరిగే సరికి రష్యా కూడా అదే పని మొదలుపెట్టింది.
అంతరిక్షంలో ‘మొదటి’ పేరు కోసం రెండు దేశాలూ పోటాపోటీగా పనిచేశాయి. అంతరిక్షంలోకి మొదటి ఉపగ్రహం (స్పుత్నిక్), మొదటి ప్రాణి (లైకా అనే కుక్క), వ్యక్తి (యూరీ గాగరిన్), మహిళ (తెరిష్కోవా) లాంటి రికార్డులు రష్యా సొంతం చేసుకుంటే… అంతరిక్షం నుంచి మొదటి ఫోటో, చింపాంజీ (హామ్), పైలెట్ (అలెన్ షెపర్డ్) లాంటి రికార్డులను అమెరికా వశం చేసుకుంది. లోకం అంతా ఈ రెండు దేశాల మధ్య పోటీని అబ్బురంగా చూసేది. 1969లో అమెరికా వ్యోమనౌక అపోలో 11 ద్వారా మనిషి చంద్రుని మీద కాలుపెట్టాడు.
అది పోటీకి ముగింపు పలకలేదు సరికదా… చంద్రుడిని కూడా దాటాలనే ప్రయత్నానికి పురిగొల్పింది. రష్యా ఏకంగా కుజుడి మీదకే ఓ వ్యోమనౌకను పంపింది. మన దేశం సొంతంగా అంతరిక్ష విజయాలు సాధించేవరకు చెప్పుకొన్న రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర కూడా రష్యా సాయంతో జరిగిందే. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయ్యేంతవరకు ఇరుదేశాల మధ్య పోటీ మేటిగానే సాగింది. ఇదీ పోటీ మహిమ!
ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి అనే తత్వంతో కాకుండా, పూర్తి సత్తా చాటాలి అనే ప్రయత్నంలో సాగే పోటీ మంచి ఫలితాలనే ఇస్తుంది. పెద్దలు చెప్పే మాటల సంగతి అటుంచితే పోటీతత్వం గురించి నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్పే సానుకూలమైన విషయాలు వినాల్సిందే!
అంబానీ సోదరుల మధ్య ఆస్తుల విభజన, ఆ తర్వాత జరిగిన ఆధిపత్య పోరును దేశం అంతా గమనించింది. అందులో ఫలితాలు అంత సమానంగా ఏమీ లేవు. ఇందుకు భిన్నంగా మరో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఏర్పడిన పోటీ… క్రీడలు, పాదరక్షల రంగాలనే మార్చేశాయి. ఆ ఇద్దరి పేర్లూ అడాల్ఫ్ డాస్లర్, రుడాల్ఫ్ డాస్లర్. బహుశా ఆ పేర్లు వింటే మనకేమీ గుర్తుకురాకపోవచ్చు. కానీ వాళ్లు స్థాపించిన అడిడాస్, ప్యూమా పేర్లు వింటే తప్పక గుర్తుపట్టేస్తాం. మొదట్లో ఇద్దరూ కలిపే గెడా అనే పాదరక్షల కంపెనీ స్థాపించారు.
అది మంచి లాభాలు ఆర్జించింది కూడా! కానీ, 30 ఏళ్లు కలిసి వ్యాపారం చేశాక, ఇక విడిపోదాం అని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. అన్నదమ్ముల మధ్య అనుమానాలు, తోటికోడళ్ల మధ్య కలహాలు లాంటి సహజమైన కారణాలే అందుకు దారితీశాయి. కంపెనీని, ఉద్యోగులను, ఆస్తులను పంచుకున్నారు. అన్న రుడాల్ఫ్ ‘ప్యూమా’ కంపెనీ ఆరంభిస్తే, తమ్ముడు అడాల్ఫ్ ‘అడిడాస్’ స్థాపించాడు. అప్పుడే టీవీలు రావడం, క్రీడా ప్రసారాలు మొదలవడం వల్ల… తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు ఈ రెండు కంపెనీలు క్రీడలను, క్రీడాకారులను ఉపయోగించుకున్నాయి.
అందుకోసం అనూహ్యమైన పనులు చేసేవారు. ఉదాహరణకు ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఓసారి తనను స్పాన్సర్ చేసిన ప్యూమా షూస్ అందరి కళ్లలో పడేందుకు ఆటను నిలిపి మరీ వాటిని ముడి వేసుకున్నాడు. ఒకరిని మించి మరొకరు ఎదగాలనే తత్వంతో ప్యూమా, అడిడాస్ పాదరక్షల వ్యాపారంలో అనూహ్యమైన విజయాలు సొంతం చేసుకున్నాయి. అంతేకాదు! క్రీడాకారులకు సైతం ఉత్పత్తులు స్పాన్సర్ చేసే అవకాశం పెంచి, ఓ గొప్ప ఆదాయమార్గాన్ని నిర్మించాయి.
ఏదైనా వ్యాపార-సేవారంగంలో ఒకే సంస్థ ఉంటే… ఇక తన షరతుల ప్రకారం నడుచుకోవాల్సిందే! అందుకే Monopolies and Restrictive Trade Practices లాంటి చట్టాలను తీసుకువచ్చాయి ప్రభుత్వాలు. ఇతర సంస్థలను గమనించకపోతే మారుతున్న కాలం, అభిరుచులు, సాంకేతికతల మీద పట్టు చిక్కదు. కొడాక్, యాహూ, పొలరాయిడ్ లాంటి కంపెనీలు విఫలం కావడానికి కారణమిదే. అంతేకాదు!
పోటీ అన్న మాట వింటేనే మనకు కాస్త ప్రతికూలమైన భావనలు స్ఫురిస్తాయి. అది సహజమే! గెలవాలనే పట్టుదలకు అహంకారం తోడైతే.. అడ్డదారులూ, అక్రమ మార్గాలూ గుర్తుకొస్తాయి. అందుకే హుందాగా ఉండే పోటీకి కొన్ని లక్షణాలు సూచిస్తున్నారు.
ఆరోగ్యకరమైన పోటీ వల్ల ప్రతి రంగంలోనూ అనూహ్యమైన వృద్ధి జరిగినట్టు చరిత్రే చెబుతున్నది.
ఇవే కాదు పాటల ప్రపంచంలో (మైకేల్ జాక్సన్ X ప్రిన్స్), కవుల లోకంలో (కీట్స్ X బైరన్), వెండితెర మీద (ఆర్నాల్డ్ ష్వాజ్నెగర్ X సిల్వెస్టర్ స్టలోన్)… ఇలా ప్రతీచోటా పోటీతత్వం ఆ రంగం పట్ల ఆకర్షణనే పెంచింది.
ఓ స్టేడియానికో, మాల్కో వెళ్తాం. అక్కడ కోకకోలా వెండింగ్ మెషిన్ కనిపిస్తుంది. సరే! కానీ సరిగ్గా దాని పక్కనే పెప్సీ మెషిన్ కూడా ఉంటుంది. గమనించారా? అనూహ్యమైన పోటీ ఉన్న ఉత్పత్తి పక్కనే, తమ ఉత్పత్తిని ఎందుకు ఉంచినట్టు? అలా కాకుండా ఇంకాస్త దూరంగా ఉంచితే ఇద్దరికీ లాభం కదా! ఇక్కడ ఓ చిన్న మాయ ఉంది. ఒక్క కోక్ మెషిన్ మాత్రమే మన కళ్లకు కనిపిస్తే… కోక్ తాగాలా వద్దా అన్న ఆలోచన మాత్రమే వస్తుంది. అలా కాకుండా కోక్, పెప్సీ మెషిన్లు పక్కపక్కనే ఉంటే… ఆ రెండిట్లో ఏది తాగాలి అనే ఎంపిక మొదలవుతుంది? సాధారణంగా ఏదో ఒకటి కొనుక్కుని మరీ వెళ్తారు. అందుకే ఈ ప్రణాళికను అనుసరించి కోకకోలా, పెప్సీలు విపరీతంగా లాభపడ్డాయని తేలింది. సినిమా హాల్స్ నుంచి చీరల దుకాణాల వరకూ పక్కపక్కనే ఉండటం వల్ల కలిగే లాభం ఇదే. కొనడం అవసరమా కాదా అన్న ఆలోచన నుంచి ఏది కొనాలి అనే స్థాయికి మన మెదడుని మాయ చేయడం.
ఓ ఇరవై లక్షల ఏళ్ల క్రితం ఉన్న మనిషి మెదడు కంటే ఇప్పుడు మూడు రెట్లు పెద్దదిగా ఉందట. ఇతర జీవులతో పోలిస్తే మన మెదళ్లే ఎందుకింత వేగంగా మార్పు చెందాయి అన్న విషయం శాస్త్రవేత్తలకు చాలా రోజులపాటు అర్థం కాలేదు. చివరికి ఈ అభివృద్ధికి మూడు ముఖ్యమైన కారణాలు
కనిపించాయి. ఒకటి- వాతావరణంలో వచ్చిన అనూహ్యమైన మార్పులు, రెండు- మారుతున్న జీవన విధానంలో ఎదురయ్యే సమస్యలకు అనుగుణంగా ఎదిగే ప్రయత్నం చేయడం! ఇక మూడో అతి ముఖ్యమైన కారణం… సామాజికపరమైన పోటీ. జీవితంలో ఎదిగేందుకు, తనను తాను నిరూపించుకునేందుకు, కుటుంబాన్ని పోషించేందుకు ఇతరులతో పోటీపడాల్సి రావడమే ఆ మూడో కారణం. పోటీ లేకపోతే
మనిషి ఉంటాడు కానీ, అతని ఉన్నతి, ఉనికి మాత్రం నామమాత్రంగానే మిగిలిపోతుందని నిరూపించే సత్యమిది. కాకపోతే ఒకే ఒక్క గోల్డెన్ రూల్. విజయం కంటే విలువలు ముఖ్యమనే పెద్దల మాటను మర్చిపోకుండా ఉంటే చాలు.