ఘట్కేసర్, నవంబర్ 20 : తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో అస్థవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు పాలకవర్గం చర్యలు చేపట్టింది. మున్సిపాలిటీ పరిధిలో కొన్ని రోజులుగా డ్రైనేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ సమస్య పరిష్కారానికి పాలకవర్గం మున్సిపాలిటీ నిధుల నుంచి రూ.46 లక్షలు కేటాయించింది. దశలో వారీగా మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపడుతామని చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ పేర్కొన్నారు.
కొనసాగుతున్న పనులు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అంతర్గత డ్రైనేజీ ని నిర్మించేందుకు పాలకవర్గం నిధులు కేటాయింది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పించాలని పాలకవర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా, మున్సిపాలిటీ పరిధిలోని 11,18 వ వార్డుల్లో పనులను ఇటీవల ప్రారంభించారు. 11వ వార్డులో రూ.30 లక్షలు,18వ వార్డులో రూ.16 లక్షలతో నిర్మిస్తున్న అంతర్గత డ్రైనేజీ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పనులను మున్సిపాలిటీ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.
దశల వారీగా అన్ని వార్డుల్లో..
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అంతర్గత డ్రైనేజీని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో అస్థవ్యస్తంగా ఉన్న డ్రైనేజీని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భవిషత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తున్నాం. ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధ్యానత ఇస్తున్నాం.
-ఎం.పావనీ జంగయ్య యాదవ్, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్
నాణ్యతగా పనులు…
ఘట్కేసర్ మున్సిపాలిటీలో అంతర్గత డ్రైనేజీని నాణ్యతగా నిర్మిస్తున్నాం. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పక్కాగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. భారీ సిమెంట్ పైపులను ఏర్పాటు చేసి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
-ఎస్.శ్రీనివాస్ మున్సిపాలిటీ ఏఈ