రఘునాథపల్లి, ఆగస్టు 28: ఆడపిల్లను పోషించడం భారమనుకున్నదేమో ఆ తల్లి.. నాలుగు రోజుల క్రితం పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను నిర్ధాక్షిణ్యంగా వదిలించుకొన్నది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని కంచనపల్లి రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున చిన్నారి ఏడుపు వినిపించడంతో స్థానికులు గుర్తించి అంగన్వాడీ టీచర్లకు సమాచారం అందించారు.
వారు అక్కడికి చేరుకొని చిన్నారిని అక్కున చేర్చుకొన్నారు. జనగామ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వచ్చి శిశువును తీసుకెళ్లారు. కాగా, ఆ పాప తల పై పెద్ద కణితి ఉండటంతో వైద్య ఖర్చులు భరించలేమని వదిలేశారా? ఆడపిల్ల అనే సాకుతో వదిలించుకొన్నారా? ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా? అనే విషయాలు తెలియాల్సి ఉన్నది.