జగద్గిరిగుట్ట : వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు. కొన్నేండ్లు సజావుగానే కలిసి కాపురం చేశారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ వారి కాపురంలో చిచ్చురేపింది. భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తనను తాను కత్తితో గాయపర్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జగద్దిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సీఐ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ (34), కళ్యాణి ఇద్దరూ పదేండ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. జగద్గిరిగుట్ట పరిధిలోని ఎల్లమ్మబండలో నివాసం ఉంటున్నారు. శ్రీధర్ సెల్‌ఫోన్స్ టవర్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. రెండేండ్లుగా కళ్యాణి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం దంపతుల మధ్య వివాదం రాజేసింది.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన రవి అనే వ్యక్తితో కళ్యాణి చనువుగా చాటింగ్ చేయడంతో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణి తనకు విడాకులు కావాలని చెప్పింది. దాంతో శ్రీధర్ సోమవారం కేబుల్ కట్‌చేసే కత్తితో కళ్యాణిపై దాడికి పాల్పడ్డాడు. ఆపై తానూ బతకనంటూ చేతిపై కోసుకున్నాడు. ఇద్దరికీ తీవ్ర రక్తస్రావం అయ్యింది.
కళ్యాణి అరుస్తూ బయటకు పరుగుతీయడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం రామ్‌దేవ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఘటనపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.