‘నువ్వే నా బెస్టీ!! బెంచ్‌మేట్.. రూమ్మేట్’ అంటూ భుజంపై చెయ్యేసి తిరిగే వాళ్లను ఏమంటాం? సింపుల్.. ‘దోస్త్’ అంటాం. యస్!! నిజమేగానీ.. ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ముసుగేసుకుని ఉంటే.. ప్రాణ స్నేహితులుగా.. మనతోనే తిరుగుతూ అదును చూసి వెన్నుపోటు పొడిస్తే!! రాజనాల, నాగభూషణం జమానాలోనే కాదు.. నేటి జెన్-జీ మోడ్రన్ యుగంలోనూ ఈ తరహా ఎనిమీ దోస్తులు చాలామందే ఉన్నారు! అంతేనా.. ఆ ఎనిమీలను ఇట్టే పట్టేస్తాం, దూరం పెట్టేస్తాం.. అనుకుంటే పొరపాటే! ఎందుకంటే వాళ్లు ఫ్రెండ్స్‌లా కనిపించే ఫ్రెనిమీలు! వీళ్లు ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా లైఫ్‌లోకి ఎంటరవుతారో చెప్పలేం. ఇంకా చెప్పాలంటే వీళ్లు డీ కోడ్ చేయలేని డేంజరెస్ మాల్వేర్స్ లాంటోళ్లు! ఫ్రెండ్స్‌లా కనిపించే ఈ ఫ్రెనిమీలను ఫిల్టర్ ఎలా చేయాలంటే..
ఫ్రెనిమీలకు మీ విజయం నచ్చదు. ప్రమోషన్ వస్తే నవ్వుతూ ‘అభినందనలు‘ చెబుతారు. హగ్ ఇస్తారుగానీ.. వెంటనే బగ్ ఎలా పెట్టాలా? అని ఆలోచిస్తారు. మీ ఎదుగుదల చూస్తూ చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. కొలీగ్స్ దగ్గర చిల్లర పుకార్లు స్ప్రెడ్ చేయిస్తారు. ‘ప్రమోషన్ పనిచేస్తే వచ్చింది కాదనీ.. బాస్‌ని మెప్పిస్తే వచ్చిందని’ గాసిప్స్ స్ప్రెడ్ చేస్తారు. మీకు తెలియకుండా ఇంత చేస్తారు కదా! అదే మీ సమక్షంలో మాత్రం కోరితే ప్రాణమైనా ఇస్తామన్నంతగా బిల్డప్ ఇస్తుంటారు. చిన్నచిన్న విషయాలకే అతిగా పొగిడేస్తారు. ‘నువ్వు తోపహే..’ అని మునగచెట్టు ఎక్కించేస్తారు. కానీ, ఆ కాంప్లిమెంట్ వెనకే కన్నింగ్ ఉద్దేశం ఉంటుంది. పొగడ్తలతో ఉబ్బిపోయేలా చేసి.. మీ సక్సెస్ సీక్రెట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు.. ‘నువ్వు చాలా స్మార్ట్’ అంటూనే.. స్వీట్‌గా మీతో తప్పు చేయించడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. ఇంకా ఏమేం చేస్తారంటే..
క్రెడిట్ కొట్టేస్తారు: మీతోనే ఉంటూ.. జట్టుగా పనిచేస్తూ.. మీ కష్టాన్ని వాళ్ల ఖాతాలో క్రెడిట్ చేసుకునేందుకు చూస్తారు. మీ ఐడియాలను కాపీ కొట్టి.. వాళ్లవిగా చెబుతుంటారు. నువ్వు నా ప్రియమిత్రుడివి అంటూనే.. సీక్రెట్ స్పైవేర్లా కాపు కాస్తారు. సందు దొరికితే చాలు మీ శ్రమను మీకు తెలియకుండానే దోచేస్తారు.
పుకార్ల పుట్టలు: ఫ్రెనిమీలకు పుకార్లు చెప్పడం ఇష్టం. మీ దగ్గరేమో మీకు గిట్టనివారిపై చాడీలు చెబుతారు. ఆ వ్యక్తికేమో మీ గురించి గాసిప్స్ చేరవేస్తుంటారు. మీపై వచ్చిన పుకార్లను ఖండిస్తూనే.. ‘నిప్పు లేనిదే పొగ రాదు కదా!’ అని పెదవి విరుస్తారు. పైగా, ‘నీ గురించి గాసిప్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. నేను నమ్మలేదనుకో’ అని ఆస్కార్ యాక్టింగ్ చేస్తారు.
తప్పులను ఎత్తి చూపుతారు: మీరేదైనా చిన్న పొరపాటు చేసినా ఫ్రెనిమీలు ఓవర్‌గా రియాక్ట్ అవుతారు. ‘నువ్వు ఇలా చేయడం ఏంటి?’ అని తెగ హైరానా పడిపోతారు. ప్రాజెక్టులో మీ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ముందు తెలిసినా.. చెప్పరు. పైగా అఫీషియల్ మీటింగ్‌లో ఆ తప్పును ఎత్తిచూపే ప్రయత్నం చేస్తారు.
స్వప్రయోజనాలే ముఖ్యం: చేసే పనిలో వాళ్లకేమైనా ప్రయోజనం ఉంటేనే కలిసికట్టుగా పనిచేస్తారు. వాళ్లకు రావాల్సిన గుర్తింపు కోసం మీ శ్రమను దోచుకునేందుకు వెనకాడరు. దీన్నే సైకాలజిస్టులు ‘ఇన్స్ట్రుమెంటల్ ఫ్రెండ్షిప్’గా చెబుతారు. వీరి స్నేహంలో కేరింగ్ కంటే వారికొచ్చే కంఫర్ట్ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు.
పోటీ పడతారు: ఫ్రెనిమీలకు పోటీ ఎక్కువ. మీరేం చేసినా వాళ్లు దాన్ని అధిగమించాలని చూస్తారు. మీరు ఒక ప్రాజెక్ట్ పూర్తిచేసి గుర్తింపు తెచ్చుకుంటే.. వాళ్లు దానికంటే మరో పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటారు. దాంతో మిమ్మల్ని అధిగమించాలని చూస్తారు. ఇది స్నేహపూర్వక పోటీ కాదు. మిమ్మల్ని డౌన్ చేయాలనే ఆలోచనే వారి లక్ష్యం!
వెనక్కి లాగుతారు: ఏం సాధించాలన్నా ఆశగా ముందుకు సాగాలి. కానీ, ఈ ఫ్రెనిమీలు తోడుంటే నిరాశలోకి నెట్టేస్తుంటారు. ‘ఏదైనా కొత్తగా చేద్దాం’ అంటే.. ముందే అడ్డుపుల్ల వేస్తారు. ‘మనతో కాదులే.. ఇప్పుడు ఎందుకులే!!’ అంటూ వెనక్కి లాగుతారు.
అన్నీ వద్దు: ఇలాంటి కన్నింగ్ ఫ్రెండ్స్‌తో అన్నీ పంచుకోవద్దు. అలాగని దూరం పెట్టొద్దు.
తప్పుగా మాట్లాడొద్దు: వాళ్లని ఫేక్ మనుషులుగా దూషించొద్దు. ఇలా ఉంటే బాగుంటుందని మర్యాదగా చెబితే చాలు.
సమయం ఇవ్వండి: వారిని విలన్లుగా చూడొద్దు. వారి ప్రవర్తనపై మీ అభ్యంతరాలు చెప్పండి. మారేందుకు సమయం ఇవ్వండి.
హద్దులు పెట్టొచ్చు: వారికి మీరిచ్చే స్పేస్ ఎంతో చెప్పండి. అక్కడివరకే వారిని పరిమితం చేయండి. అంతేకానీ.. గుర్తించిన వెంటనే సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం, నంబర్ డిలిట్ చేయడం.. లాంటివి చేయొద్దు.
ఇట్టే వదిలేయొద్దు: బెస్ట్ ఫ్రెండ్ కాస్తా ఫ్రెనిమీ అని తేలితే తట్టుకోవడం కష్టమే! ఇట్టే వారిని దూరం చేసుకోలేం కూడా! అందుకే వారితో సున్నితంగా మాట్లాడాలి. వారికి మీరెంత ప్రాధాన్యం ఇచ్చారో చెప్పాలి. మీపట్ల వాళ్లెందుకలా బిహేవ్ చేస్తున్నారో తెలుసుకోవాలి. కదలించే స్టోరీ ఏదైనా ఉంటే వారిని సపోర్ట్ చేస్తూ.. మార్పు తీసుకురావాలి. వారితో గడిపిన సంతోషకరమైన మెమరీస్ గుర్తుచేసి.. వాళ్లంటే మీకు ఎంత ఇష్టమో అర్థమయ్యేలా చెప్పాలి.
ఈ ప్రశ్నల్లో అన్నింటికి ‘యస్’ అనేది మీ సమాధానమైతే మీరు కచ్చితంగా మంచి ఫ్రెండే.. ఫ్రెనిమీ కాదు.