నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి 2 : దళితబంధు పథకాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు యూనిట్ల్ల తుది జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్లో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనువైన యూనిట్ల గుర్తింపు కోసం ఇప్పటికే వివిధ రంగాల్లో స్ధిరపడిన వ్యాపారులను సమావేశానికి ఆహ్వానించి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. సిమెంట్ ఇటుకల తయారీ, మొబైల్ స్పేర్స్, ఇంటర్నెట్ కేఫ్, జిరాక్స్, డీటీపీ సెంటర్, ఫ్లోర్మిల్స్, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పర్యావరాణ హితంగా నిలిచే బ్యాగుల తయారీ, పశువుల పెంపకం, డెయిరీ యూనిట్లకు సంబంధించి వివరాలను వ్యాపారులు వివరించారు. దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం అమలు చేస్తున్నదని కలెక్టర్ అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.